Veeraiah Chowdary : వీరయ్య చౌదరి ని హత్య చేయడానికి కారణం అదేనా..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు ?
Veeraiah Chowdary : ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాతో సంబంధాలు ఉన్నవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 08:43 PM, Wed - 23 April 25

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసుల విచారణ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై ఒంగోలు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాతో సంబంధాలు ఉన్నవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టులతో కేసు దిశ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Veeraiah Chowdary : వీరయ్య చౌదరి శరీరంపై కత్తిపోట్లు చూసి చంద్రబాబు కన్నీరు
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గతంలో రేషన్ బియ్యం వ్యాపారంలో చోటుచేసుకున్న విభేదాలే వీరయ్య చౌదరి హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వాసు అనే బియ్యం వ్యాపారి హత్యకు పాల్పడ్డ మాఫియా గుంపే ఈ దాడిలో కూడా పాత్ర పోషించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య చౌదరి బియ్యం అక్రమ రవాణాకు విరుద్ధంగా ఉండటం, ఈ వ్యాపారంలో జోక్యం చేసుకోవడమే హత్యకు దారి తీసిందని దర్యాప్తులో ప్రధాన కోణంగా పరిశీలిస్తున్నారు.
ఇక హత్య జరిగినప్పటి నుంచి ఓ కీలక మాఫియా వ్యక్తి అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు, అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఒంగోలుకు తరలించి విచారణ జరిపి, అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ వేగంగా కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కేసు మిస్టరీ వీడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.