Andhra University : ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత..రంగంలోకి పోలీసులు
ఏబీవీపీ శ్రేణులు వీసీ ఆఫీసు ముట్టడికి యత్నిస్తున్న సమయంలోనే, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కూడా అక్కడికి చేరుకుని ప్రతినినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, అది కాస్తా తోపులాటకు దారితీసింది.
- Author : Sudheer
Date : 18-02-2026 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) బుధువారం రణరంగంగా మారింది. గత రెండు రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య నలుగుతున్న వివాదం ముదిరి, చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో నిన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నిర్వహించిన ‘పథ సంచాలన్’ (మార్చ్)ను ఎస్‌ఎఫ్‌ఐ (SFI) కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. విద్యా సంస్థల్లో మతపరమైన లేదా రాజకీయ కవాతులు నిర్వహించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ వాదించగా, దీనిని నిరసిస్తూ ఏబీవీపీ (ABVP) నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎస్‌ఎఫ్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వైస్ ఛాన్సలర్ (VC) కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
ఏబీవీపీ శ్రేణులు వీసీ ఆఫీసు ముట్టడికి యత్నిస్తున్న సమయంలోనే, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కూడా అక్కడికి చేరుకుని ప్రతినినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, అది కాస్తా తోపులాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగే పరిస్థితి రావడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వర్సిటీ భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేయలేకపోయారు, దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు భారీగా క్యాంపస్‌కు చేరుకుని ఘర్షణ పడుతున్న విద్యార్థులను చెల్లాచెదురు చేశారు. పరిస్థితి మరీ విషమించకుండా ఉండేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారాలకు పోలీసులు తాళాలు వేశారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు లేదా ఇతర రాజకీయ శ్రేణులు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఏయూ పరిసరాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది. విద్యార్థి సంఘాల నేతలతో పోలీసులు చర్చలు జరుపుతూ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు.