Mahanadu 2025 : కడపలో టీడీపీ ‘మహానాడు’
Mahanadu 2025 : మహానాడుకు ముందు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం
- By Sudheer Published Date - 07:18 AM, Sat - 1 February 25

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఈ ఏడాది మహానాడు సమావేశాన్ని కడప(Kadapa)లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఒక తీర్మానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కడప మహానాడు (Mahanadu 2025) కీలకంగా మారనుంది. మహానాడుకు ముందు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) నేతృత్వంలో జరిగిన ఈ భేటీ నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ రాజకీయ పరిణామాలు, వైసీపీ పాలనలో చోటుచేసుకున్న మార్పులు, జిల్లాల పునర్విభజన అంశాలపై కూడా సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది.
IND vs ENG : ఇంగ్లండ్ పై భారత్ ఘనవిజయం
వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజనలో అనేక లోపాలు ఉన్నాయని, ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్న అంశాలను సరిదిద్దాలని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మహానాడు ద్వారా పార్టీ శ్రేణులకు పునరుత్తేజం కలిగించేలా కీలక వ్యూహాలు సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ, బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలోనే నిర్మించాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మహానాడు ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నందమూరి బాలకృష్ణను పొలిట్ బ్యూరో సమావేశంలో అభినందించారు. తెలుగు సినీ పరిశ్రమకు, సేవా కార్యక్రమాలకు బాలకృష్ణ అందించిన విశేష సేవలను గుర్తించబడిందని, ఇది టీడీపీ శ్రేణులకు గర్వకారణమని నేతలు వ్యాఖ్యానించారు. పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.