Angallu Violence Case : సుప్రీంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో 6 పిటిషన్ల కొట్టివేత
Angallu Violence Case : సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
- By Pasha Published Date - 12:58 PM, Tue - 3 October 23

Angallu Violence Case : సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఏపీ సర్కారు దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించే పోలీసులనే ఎఫ్ఐఆర్ లో సాక్షులుగా ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పోలీసులే సాక్షులుగా ఉంటారా అని నిలదీసింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
టీడీపీ అధినేత చంద్రబాబు జల ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా అన్నమయ్య జిల్లా అంగళ్లుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన ఘటనల తర్వాత టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చారు. అయితే టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి , నల్లారి కిషోర్ కుమర్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ తర్వాత హైకోర్టు టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు వేసింది. టీడీపీ నేతలకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ సుప్రీంకోర్టు ఇవాళ ఆ పిటిషన్లన్నీ కొట్టేసింది.