Chandrababu – Supreme Court : చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
Chandrababu - Supreme Court : ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలుచేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ ఉదయం విచారణ జరిగింది.
- By Pasha Published Date - 12:04 PM, Fri - 20 October 23

Chandrababu – Supreme Court : ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలుచేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ ఉదయం విచారణ జరిగింది. వాదనలు విన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్ 9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరగా.. రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తాం. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితిని కొనసాగించాలి’’ అని కోర్టు ఆదేశించింది. ఫైబర్‌నెట్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును (Chandrababu – Supreme Court) చంద్రబాబు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నవంబర్ 8న తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాల వాదోపవాదనలు ముగియగా తీర్పును సుప్రీంకోర్టు బెంచ్ రిజర్వ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
వివిధ కేసుల్లో ఏకకాలంలో విచారణ కొనసాగుతున్నందున టీడీపీ చీఫ్ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో రోజుకు మూడుసార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాదు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఇవాళ తిరస్కరించింది. జైలులో రోజుకు కనీసం 50 నిమిషాల పాటు చంద్రబాబుతో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనకు కూడా న్యాయస్థానం నో చెప్పింది. ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదని న్యాయాధికారి తెలిపారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు కోర్టు అనుమతించింది.