AP Govt : ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి
AP Govt : రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశగా మార్గదర్శకత్వం అందించేందుకు వీరిద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది
- By Sudheer Published Date - 08:09 AM, Thu - 20 March 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా (Suchitra) మరియు DRDO మాజీ చీఫ్ జి. సతీశ్ రెడ్డి (Sateesh Reddy) ప్రభుత్వ సలహాదారులుగా (Advisors ) నియమితులయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశగా మార్గదర్శకత్వం అందించేందుకు వీరిద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరి నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
సుచిత్రా ఎల్లా చేనేత మరియు హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆమె భారత్ బయోటెక్ కంపెనీ ద్వారా భారతదేశంలో టీకాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పారిశ్రామిక రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె, రాష్ట్రంలోని చేనేత, హస్తకళల రంగాలను ప్రోత్సహించేందుకు కొత్త కార్యక్రమాలు రూపొందించనున్నారు. సుచిత్ర సేవల ద్వారా ఈ రంగాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది.
మరోవైపు జి. సతీశ్ రెడ్డి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. దేశ రక్షణ రంగంలో కీలకమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్న ఆయన, రాష్ట్రాన్ని రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వానికి మార్గదర్శకత్వం అందించనున్నారు. వీరిద్దరూ క్యాబినెట్ హోదాతో రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర పరిశ్రమలు, అభివృద్ధి రంగాలు మరింత ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.