Tadipatri Riots : తాడిపత్రిలో అల్లర్ల వ్యవహారం.. 575 మందిపై కేసులు
ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.
- By Pasha Published Date - 12:57 PM, Sun - 19 May 24

Tadipatri Riots : ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలవల్ల హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదైన 575 మందిలో 120 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపర్చారు. కడప జైలుకు 90 మందిని రిమాండ్ కు పంపారు. 30 మందిని జిల్లాలోని వివిధ జైళ్లలో రిమాండ్ లో ఉంచారు. అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్నంతో పాటు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల్లో గాలిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అల్లర్లు అదుపు చేయలేకపోయిన జిల్లా ఎస్పీ అమిత్ ను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తాడిపత్రి డీఎస్పీ రంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణపై వేటు వేసింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న సిట్ బృందం నివేదిక సమర్పించిన అనంతరం మరి కొంతమంది అధికారులపై వేటు వేసే అవకాశం ఉంది. ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. తాజాగా శనివారం రాత్రి తాడిపత్రి (Tadipatri Riots) పట్టణానికి సిట్ చేరుకుంది. ముఖ్యంగా పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల పై సిట్ బృందం పరిశీలన కొనసాగుతోంది. దశాబ్దాల కాలంగా ఇక్కడ జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన బందోస్తు చేపట్టలేదా? పోగేసిన రాళ్లగుట్ట ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు? జిల్లా ఎస్పీ అమిత్ పైన రాళ్ల వర్షం కురిపించేంతగా హింసను ఎందుకు అదుపు చేయలేకపోయారు? గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే కోణాల్లో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది.