Gun Firing : సినిమా రేంజ్ లో నెల్లూరులో కాల్పులు
Gun Firing : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు చేసిన చర్యలు సినిమా తరహాలో జరిగాయి
- By Sudheer Published Date - 07:17 PM, Sun - 17 August 25

నెల్లూరులో జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు చేసిన చర్యలు సినిమా తరహాలో జరిగాయి. రాజమండ్రికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి తన కారులో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో ఈగల్ టీం, స్థానిక పోలీసులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ప్రకాష్ పారిపోవడానికి ప్రయత్నించి వాహనాన్ని వేగంగా నడుపుతూ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఫిరోజ్ తీవ్రంగా గాయపడగా, పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన సీఐ సాంబశివరావు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌పై ఇప్పటికే ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. అతను గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా గుర్తించబడినట్లు పేర్కొన్నారు. నిందితుడు తరచుగా జిల్లాల మధ్య గంజాయి తరలిస్తూ నేర చట్రంలో చురుకుగా వ్యవహరించేవాడని చెప్పారు. ఈసారి కూడా అతను పెద్ద మొత్తంలో గంజాయి తరలించడానికి యత్నించగా, పోలీసుల అప్రమత్తతతో పట్టుబడినట్లు వెల్లడించారు.
TG Local Body Elections : ఈ సమావేశంలోనైనా పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందో..?
ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ టీం ఇప్పటి వరకు 23,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. “ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్” పేరుతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, విద్యార్థులకు గంజాయి అందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒడిశా నుంచి గంజాయి రాకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నామని వివరించారు. గంజాయి అక్రమ రవాణా లేదా అమ్మకాలపై ప్రజలు 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.