Shocking Story Of Rape: 13 ఏళ్ల బాలికపై 80 మంది లైంగికదాడి కేసులో…బాధితురాలి విషాదగాథ
13 ఏళ్ల బాలికపై 80 మంది లైంగిక దాడి జరిపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
- By Hashtag U Published Date - 06:00 AM, Fri - 29 April 22

13 ఏళ్ల బాలికపై 80 మంది లైంగిక దాడి జరిపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దత్తత పేరిట వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆ అమాయక బాలికను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 8 నెలల పాటు వ్యభిచారం చేయించారు. చివరకు పోలీసులకు చిక్కడంతో ఈ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది.
వివరాల్లోకి వెళితే వ్యభిచార ముఠా నుంచి తప్పించుకున్న 13 ఏళ్ల రాధిక (పేరు మార్చబడింది)కి భయంకరమైన గాయం నుండి బయటపడటం అంత సులభం కాదు. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన రాధిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి గతేడాది జూన్ లో కోవిడ్ బారిన పడి మరణించింది.
దీంతో రాధిక స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న స్వర్ణలత బాలికను దత్తత పేరిట వ్యభిచార కూపంలోకి దింపింది. అయితే ఈ విషయాలు బాధిత బాలిక తండ్రికి తెలియకుండా జరిగాయి. బాలికను స్వర్ణలత (ప్రస్తుతం ప్రధాన నిందితురాలిగా చేర్చారు) అనే మహిళ కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి నెట్టేసింది. బాధిత బాలిక రాధిక ఆమె చెరలో ఒక నెల తర్వాత, తప్పించుకోగలిగినప్పటికీ, మరొక ఏజెంట్ బాలికను గుర్తించి, తిరిగి వ్యభిచారంలోకి తీసుకువెళ్లి, దాదాపు ఆరు నెలల పాటు పలు ప్రాంతాలకు చేరవేశారు. అక్కడ బాలికపై ఎంతో మంది కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
చివరకు డిసెంబర్ 18, 2021న బాలిక ఆ కూపం నుంచి తప్పించుకుంది. ఆమె ఇంటికి చేరుకుంది, జరిగిన విషయం తెలసుకున్న ఆమె తండ్రి గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంచలనంగా మారిన ఈ కేసులో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 77 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణ అధికారి ASP కె సుప్రజ మాట్లాడుతూ – బాధితురాలికి తీవ్ర రక్త స్రావం జరిగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. ఆమెను గుంటూరు జీజీహెచ్‌లో చేర్చి 15 రోజుల తర్వాత డిశ్చార్జి చేశారని. ఆమె ఆసుపత్రిలో చేరినప్పుడు సఖి సెంటర్ లీగల్ కౌన్సెలర్ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
బాధిత బాలిక పరిస్థితిని గమనించిన సైకాలజీ కౌన్సిలర్ విజయ కుమారి వివరిస్తూ, – బాధితురాలు రాధికను GGH ఆసుపత్రికి తీసుకువచ్చిన మొదటి రోజు ఆమె చాలా భయంతో ఉంది. తీవ్ర నొప్పితో బాధపడుతూ మాట్లాడలేకపోయింది. డాక్టర్లను కూడా తన దగ్గరకు అనుమతించలేదు. దాదాపు ఒక వారం తర్వాత, ఆమె భయపడకుండా కొంతమందితో మాట్లాడగలిగిందని తెలిపారు. ప్రతివారం కౌన్సిలింగ్ నిర్వహించిన బాలికకు మనోధైర్యం ఇచ్చినట్లు తెలిపారు.
కొద్దిరోజుల తర్వాత ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) అధికారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా కమిషన్ ఆదేశాల మేరకు బాలికను గుంటూరులోని షెల్టర్ హోంకు తరలించారు. మొదటి ఐదు సెషన్‌లలో ఆమె తనపై జరిగిన ఘటనను వివరించడంలో చాలా భయానికి, ఆవేదనకు, మానసిక ఒత్తిడికి గురైనట్లు కౌన్సిలర్ గుర్తు చేసుకున్నారు. సుమారు మూడు నెలల తర్వాత అంటే మార్చి నెలలో బాలిక కోలుకుంది. ఏప్రిల్ నెల ప్రారంభంలో, బాలిక అభ్యర్థన మేరకు, ఆమె ఉనికి బాహ్యప్రపంచానికి బహిర్గతం చేయకుండా ఉండటానికి అధికారులు రాధికను, మంగళగిరిలోని క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న మేయర్స్ హోమ్‌కు తరలించారు.
బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని వారం రోజుల క్రితం బాలికను పరామర్శించారు. బాలిక నవ్వుతూ, ఇతర పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. వీలైనంత త్వరగా పాఠశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అంతే కాదు తాను ఐపీఎస్ అధికారి కావాలనుకుంటున్నానని కూడా చెప్పినట్లు మనోరంజని పేర్కొంది.
బాలికకు సరైన సైకలాజికల్ సహాయం అందలేదు..
బాధిత బాలిక భయంకరమైన గాయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆమెకు ఎటువంటి సైకలాజికల్ సహాయం అందలేదని గుంటూరులోని మానసిక వైద్యుడు డాక్టర్ జి జగదీష్ కుమార్ ఎత్తి చూపారు. ఎన్నో కష్టాలు, మానసిక, శారీరక వేదన అనుభవించినా బాలికకు కేవలం కౌన్సిలింగ్ సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. కౌన్సెలింగ్ అనేది ప్రేరణ లాంటిది, చికిత్స కాదు. అత్యాచారం నుండి బయటపడిన వారిలో ఎక్కువ మంది నిరాశ, ఆందోళనలో కూరుకుపోతారు. ఈ లక్షణాలను సాధారణ కౌన్సెలర్లు గుర్తించలేరని ఆయన తెలిపారు. అంతేకాదు చికిత్స లేకుండా వదిలేస్తే, వారు దీర్ఘకాలంలో ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని మానసిక వైద్యుడు హెచ్చరించారు.
మానసిక రోగనిర్ధారణ తర్వాత, యాంటీ-డిప్రెసెంట్స్‌తో సహా మందులు సైతం వాడాల్సి ఉంటుందని సూచించారు. కౌన్సెలింగ్ కోసం సైకాలజిస్ట్‌కి రిఫర్ చేయవచ్చు. రేప్ మరియు ట్రాఫికింగ్ ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించకుండా వదిలేస్తే, వారు భవిష్యత్తులో తీవ్రమైన మానసిక, లైంగిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని జగదీష్ తెలిపారు.
సాధారణ కౌన్సెలింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని అంగీకరిస్తూ, ఇది కేవలం బ్యాండ్-ఎయిడ్‌గా పని చేస్తుందని డాక్టర్ జగదీష్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే నందిని తండ్రి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షల రూపాయలకు పైగా పరిహారం అందుకున్నట్లు కూడా తెలిసింది.
నేరం విచారణ జరిగిన విధానం:
జూన్ 26, 2021: GGHకి చెందిన స్వర్ణలత అనే దళారీ చేతిలో దత్తత పేరితు బాలిక కిడ్నాప్
డిసెంబర్ 18, 2021: బాలిక ఇంటికి చేరుకుంది. అదే రోజు కేసు నమోదు
డిసెంబర్ 25: 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఫిబ్రవరి: అరెస్టుల సంఖ్య 56కి పెరిగింది
ఏప్రిల్ 19: ఎక్కువ మందిని అదుపులోకి తీసుకున్నారు, సంఖ్య 73కి పెరిగింది
ఏప్రిల్ 27: మరో నలుగురి అరెస్ట్