Palasa: టెన్షన్..టెన్షన్ ..సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
Seediri Appalaraju house arrest : వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడైన అల్లూరామణ పై టీడీపీ నేతలు శనివారం హత్యాయత్నం చేసినట్లు సమాచారం
- By Sudheer Published Date - 02:18 PM, Sun - 27 October 24

పలాస (Palasa) నియోజకవర్గంలో రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడైన అల్లూరామణ పై టీడీపీ నేతలు శనివారం హత్యాయత్నం చేసినట్లు సమాచారం. అల్లూరామణ, దాడికి సంబంధించిన ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఇతర వైసీపీ నేతలు మన్మథరావు తో పలువురు వ్యక్తులపై కూడా టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న టీడీపీ సీనియర్ నేతలు పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు, మరియు సప్ప నవీన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. చుట్టూ పోలీసులు ఉన్న దాడిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారు.
ఈ ఘటన పై వైసీపీ నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) ఆవేదన వ్యక్తం చేస్తూ, మైనర్ బాలికలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులపై దాడులు జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. పలాసలో జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇంటి నుంచి బయలుదేరిన అప్పలరాజును పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అప్పలరాజు బయటకు వస్తే శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతుంది అంటూ పోలీసులు చెపుతున్నారు. మరోపక్క పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ, “తమకు రక్షణ కల్పించడం లేదు” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
Read Also : Digital Condom : మార్కెట్ లోకి ‘డిజిటల్ కండోమ్’ యాప్