RK Roja : రోజా జైలుకు వెళ్లడం ఖాయం..కౌన్ డౌన్ స్టార్ట్ – రవినాయుడు
RK Roja : రోజా క్రీడాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఒక్క స్టేడియం అయినా నిర్మించలేదని అన్నారు. ఆమె అధికంగా తమిళనాడులోనే గడుపుతూ నగరికి సందర్శకురాలిగా వచ్చిపోతారని ఎద్దేవా చేశారు
- By Sudheer Published Date - 08:32 PM, Mon - 21 July 25

వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా(Roja)పై టీడీపీ నేత, శాప్ ఛైర్మన్ రవినాయుడు (Ravinaidu) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేశాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రవినాయుడు, రోజా అవినీతికి పాల్పడినట్టు ఆరోపించారు. “ఆడుదాం – ఆంధ్రా” కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనీ, దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఆగస్ట్ 10వ తేదీలోగా రోజా జైలుకు వెళ్లడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని, రోజాలు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు.
రోజా క్రీడాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఒక్క స్టేడియం అయినా నిర్మించలేదని అన్నారు. ఆమె అధికంగా తమిళనాడులోనే గడుపుతూ నగరికి సందర్శకురాలిగా వచ్చిపోతారని ఎద్దేవా చేశారు. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించిన ఆయన, అవి సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ముఖ్యంగా చంద్రబాబుని అవమానించే భాషను వాడడం తగదని సూచించారు. ఆమె సంస్కారాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
EV Bikes : విద్యార్థులు, ఉద్యోగుల కోసం 5 మోడళ్లలో సరికొత్త ఈవీ స్కూటర్లు..బడ్జెట్ ధరల్లో మీకోసం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి కేసుల్లో విచారణలు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణస్వామిలకు కూడా నోటీసులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రవినాయుడు చేసిన రోజా అరెస్టు వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. ఇది నిజంగా విచారణలో భాగంగా జరిగే చర్యా? లేక రాజకీయ కక్షపూరిత చర్యేనా అన్నదానిపై చర్చ మొదలైంది.
ఇక వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విపక్షాలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు, కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. రవినాయుడు వ్యాఖ్యలను కూడా అదే పరిధిలో చూసుకోవాలని చెబుతోంది. ఇక రోజా ఇప్పటివరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు.