Pawan Kalyan : రాజకీయ రామయ్యలు పార్టీల కృష్ణయ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.
- By CS Rao Published Date - 02:12 PM, Wed - 9 March 22

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. ఆ విషయాన్ని మహిళాదినోత్సవం రోజు చిరంజీవి వెల్లడించాడు. ఆ స్టేట్ మెంట్ హీరో పవన్ క్రేజ్ ను పెంచిందా? వ్యూహాత్మకంగా తగ్గించేలా ఉందా? అనే సందేహం టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా పవన్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతుందని చాలా మందిలోని అనుమానం. అందుకు నిదర్శనంగా రామ్ చరణ్ , అల్లు అర్జున్ సినిమాల ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు పవన్ దూరంగా ఉండడమే. ఒకానొక సందర్భంగా పవన్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగబాబు మాట్లాడిన విషయం విదితమే. ఇవన్నీ గమనిస్తే, మెగా కుటుంబంలో ఏమి జరుగుతుందనే ఆసక్తి పెరుగుతోంది. సినిమా టిక్కెట్ల ధరల విషయంలోనూ అల్లు అరవింద్, పవన్, చిరంజీవి ఎవరిదోవ వాళ్లదే అన్నట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత జరిగిన పరిణామాలు అల్లు అరవింద్, పవన్ కు దూరం పెంచేలా చేశాయని అప్పట్లో అనుకున్నారు. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఎపిసోడ్ ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని మెగా కోట నుంచి వినిపిస్తోన్న మాట. టాలీవుడ్ కేంద్రంగా అల్లు, మెగా కుటుంబాల మధ్య చాలా కాలం సాన్నిహిత్యం నడిచింది. హీరోగా చిరంజీవి గ్రాఫ్ పడిపోయిప్పుడల్లా అరవింద్ ఏదో ఒక సినిమా ద్వారా పైకి లేపిని సందర్భాలు అనేకం. వాటిలో ఒకటి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా. అలాంటి సినిమాల జాబితాలో యమకింకరుడు కూడా ఉంది. అలాగే యముడికి మొగుడు సినిమా, పసివాడి ప్రాణం ఇలా..చెప్పుకుంటూ పోతే చిరంజీవి గ్రాఫ్ పడిపోయినప్పుడు మళ్లీ లేపిన సినిమాలు. అవన్నీ అల్లు అరవింద్ చేసిన మ్యాజిక్ కారణంగా హిట్ అయినవని టాలీవుడ్ లో చాలా మంది చెప్పుకుంటారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా మగధీరుడు. ఆ సినిమా తరువాత రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ లోకి వెళ్లిపోయాడు. కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం గీతా ఆర్ట్స్ ఎప్పుడూ అండగా నిలవలేదు. ఆయన సినిమాల్లో ఎక్కువగా ఫెయిల్ అయినవే ఉంటాయి. హిట్ కొట్టిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ అభిమానుల్లో ఆయన క్రేజ్ నిలబడడానికి కారణం చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు. అదే విషయాన్ని నాగబాబు ఒకానొక సందర్భంలో అభిమానుల ఎదుట వెల్లడించాడు. ప్రస్తుతం టాప్ హీరోల జాబితాలో ఒకే కుంటుంబం నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ , పవన్ ఉన్నారు. స్వతహాగా కుమారుడు కాబట్టి అల్లు అర్జున్ కు గీతా ఆర్ట్స్ మద్ధతు ఎప్పుడూ ఉంటుంది. ఇటీవల రామ్ చరణ్ ను మాత్రం అరవింద్ పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. ఆ క్రమంలోనే అల్లు, మెగా కుటుంబం మధ్య గ్యాప్ ఏర్పడిందని టాలీవుడ్ లోని గుసగుసలు. అంతేకాదు, ఆహా ఫ్లాట్ ఫారం మీద బాలయ్యను దించడం గుసగుసలకు బలం చేకూరింది.ఇక ఇప్పుడు మెగా సోదరుల మధ్య కూడా పొసగడంలేదని టాలీవుడ్ లోని గాసిప్స్. సినిమాల్లో రామ్ చరణ్ ను టాప్ హీరోగా చూడాలని తండ్రి చిరంజీవికి సహజంగా ఆశ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి నీడన టాప్ హీరోగా అభిమానుల్లో పవన్ గూడుకట్టుకున్నాడు. ఆయన గ్రాఫ్ పడే వరకు రామ్ చరణ్ కు పెద్దగా చిరంజీవి నీడ పనిచేయదని సునిశిత పరిశీలకుల భావన. అందుకే, పవన్ కల్యాణ్ వ్యవహారాలకు చిరు దూరంగా ఉంటున్నాడట. అంతేకాదు, పవన్ కు బద్ధ రాజకీయ వ్యతిరేకిగా ఉన్న జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక విందుకు ఆహ్వానించేంత సాన్నిహిత్యం జగన్, చిరు మధ్య ఏర్పడింది. పైగా సినిమా టిక్కెట్ల ధరల పెంపు పవన్ హక్కుగా భావిస్తుంటే, చిరంజీవి మాత్రం బతుకుదెరువు కోసం అంటూ అభ్యర్థిస్తున్నాడు. సరిగ్గా, ఇక్కడే ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలను గమనించవచ్చు.
ప్రస్తుతం బీజేపీతో కలిసి జనసేనాని నడుస్తున్నాడు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాడు. చిరంజీవి మాత్రం మూడు రాజధానులకు జై కొడుతున్నాడు. ఇలా పలు సందర్భాల్లో జగన్ కు అండగా చిరంజీవి నిలుస్తున్నాడు. మెగా సోదరులు ఇలా ఉంటే ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు ప్రత్యేక పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పార్టీలోకి చిరంజీవిని తీసుకెళ్లాలని కాపు నేతల ఆలోచనట. లేదంటే, రాజ్యసభను ఆఫర్ చేయడం ద్వారా వైసీపీలోకి చిరు వెళతాడని టాక్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత చిరంజీవి బీజేపీ గూటికి చేరినా ఆశ్చర్యంలేదని ఆ పార్టీ లీడర్లలోని చర్చ. జనసేన విలీనం కోసం చాలా కాలంగా బీజేపీ అధిష్టానం ఒత్తిడి తీసుకొస్తోంది. ఆ విషయాన్ని పవన్ పరోక్షంగా పలు సందర్భాల్లో చెప్పిన విషయం విదితమే. ఒక వేళ అదే జరిగితే…చిరంజీవి, పవన్ లను బీజేపీ ఒక చోటకు చేర్చే అవకాశం లేకపోలేదు. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం కూడా మరచిపోలేం. సో..ప్రస్తుతానికి ఎవరిదోవన వాళ్లు ఉన్నట్టుగా కనిపిస్తోన్న మెగా సోదరులు ఒకే పార్టీ గొడుగు కిందకు వస్తారా? లేక పరస్పరం వ్యతిరేకంగా పనిచేసే దిశగా అడుగులు వేస్తారా? అనేది ఆసక్తికర అంశం.