Letter From Jail : చంద్రబాబు లెటర్‌పై జైలు అధికారుల ప్రకటన.. నారా లోకేష్ కౌంటర్
Letter From Jail : టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పేరుతో రిలీజైన ఓపెన్ లెటర్ పై రాజమండ్రి జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 12:45 PM, Mon - 23 October 23

Letter From Jail : టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పేరుతో రిలీజైన ఓపెన్ లెటర్ పై రాజమండ్రి జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లేఖ జైలు నుంచి రిలీజైంది కానే కాదని జైలు సూపరింటెండెంట్ రాహుల్ వెల్లడించారు. ఈమేరకు వివరణ ఇస్తూ.. జైలు అధికారులు ఆదివారం రాత్రే ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘‘జైలు నిబంధనల ప్రకారం.. ఖైదీలు విడుదల చేయదల్చిన లేఖలను ముందుగా జైలర్ ధ్రువీకరించి సంబంధిత కోర్టులకు లేక ఇతర ప్రభుత్వ శాఖలకు పంపుతారు. చంద్రబాబు పేరుతో రిలీజైన లేఖకు మాతో సంబంధం లేదు. జైలు నుంచి అది రిలీజ్ కాలేదు’’ అని (Letter From Jail) జైలు ఆఫీసర్లు స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు..
జైలు అధికారుల వివరణకు నారా లోకేశ్ కౌంటర్ ఇస్తూ.. ‘‘జగన్ పాలనలో లేఖలు రాయడం కూడా దేశ ద్రోహమా? పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మేం ములాఖత్ కు వెళ్లినప్పుడు మాతో చంద్రబాబు చెప్పిన విషయాలనే ఈ లేఖలో ప్రస్తావించాం. ప్రజల ముందు పెట్టాం. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి.. లేఖ రాయడం కూడా నేరం అన్నట్టుగా పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చాయా అనిపిస్తోంది. నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్ కు కక్ష తీరలేదు. ఆఖరికి లేఖ రాసే హక్కు కూడా లేదని వేధిస్తున్నారు’’ అని నారాలోకేశ్ ఫైర్ అయ్యారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం విజయదశమి అని నారా లోకేశ్ అన్నారు. చెడుకు పోయేకాలం దగ్గర పడిందనే సందేశాన్ని దసరా ఇస్తోందన్నారు. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.