President Tour to AP: రాష్ట్రపతి ఏపీ పర్యటన! టూర్ పై రాజకీయ పదనిస!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు కావడంతో ఆ సందర్భంగా సంతరించుకునే రాజకీయ అంశాల ఆసక్తి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.
- By CS Rao Published Date - 01:43 PM, Sat - 26 November 22

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు కావడంతో ఆ సందర్భంగా సంతరించుకునే రాజకీయ అంశాల ఆసక్తి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు. ఆ తరువాత వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్ లో ప్రత్యేకంగా ముర్ము సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచన మేరకు ఆ సమావేశం జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ పరిణామం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిందని సర్వత్రా వినిపించింది. ఇప్పుడు రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న ఆమె తొలిసారిగా డిసెంబర్ 4వ తేదీన అమరావతిలో అడుగుపెట్టనున్నారు. ఆ సందర్భంగా జరిగే రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
డిసెంబర్ 4, 5 తేదీల్లో ద్రౌపది ముర్ము అమరాతి, విశాఖ కేంద్రంగా పర్యటన ఫైనల్ అయింది. 4వ తేదీన అమరావతి – విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని విశాఖ చేరుకుంటారు. అక్కడే ఆ రోజు బస చేసి 5వ తేదీన విశాఖ కేంద్రంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఏపీకి రానున్న ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం, రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ 4న ఉదయం రాష్ట్రపతి విజయవాడ చేరుకుంటారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా టీడీపీ నుంచి చంద్రబాబు హాజరువుతారా? అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది.
Also Read: AP Politics: దొరకని దొరలు! `సంకల్ప` స్కామ్ 1100 కోట్లు!!
విజయవాడ నుంచి వర్చ్యువల్ గా పలు కార్యక్రమాలను ఆమె ప్రారంభిస్తారు. వాటిలో రాయచోటి – అంగల్లె సెక్షన్ జాతీయ రహదారిని, జాతీయ రహదారి – 205పై నాలుగు లేన్ల ఆర్వోబీ – అప్రోచ్ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్ సపరేటెడ్ నిర్మాణం, మదిగుబ్బ – పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ తదితరాలు ఉన్నాయి. ఆ తరువాత రాజ్ భవన్ లో గౌరవార్దం గవర్నర్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎంతో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ, అధికార ప్రముఖులను ఆహ్వానించనున్నారు. రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు వస్తాయా? లేక సీఎం జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ మేరకు ఆహ్వానాలు ఉంటాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
గవర్నర్ విందు తరువాత ముర్ము విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించే భరత నౌకాదళ విన్యాసాలను వీక్షిస్తారు. ఆ తరువాత విశాఖలోనే బస చేసి 5వ తేదీన విశాఖ నుంచి ఢిల్లీ వెళతారు. ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో ఆమె ఏపీకి వస్తున్న క్రమంలో వైసీపీ, టీడీపీ రాజకీయ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: AP Politics: మెగా రూట్! వైసీపీలోకి `గంటా`? వైజాగ్ రాజధానికి మద్ధతుగా.!