Prashant Kishore : ఏపీ, తెలంగాణ బరిలో “SP, BSP, TMC “: పీకే నార్త్ ఆపరేషన్
ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీలు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలి అనే దానిపై సర్వేలను చేయించుకుంటున్నాయని తెలుస్తోంది.
- By CS Rao Published Date - 12:27 PM, Wed - 1 December 21

ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీలు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలి అనే దానిపై సర్వేలను చేయించుకుంటున్నాయని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ శూన్యతపై ఒక నిర్ణయానికి ఎస్పీ, బీఎస్పీ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు వచ్చినట్టు సమాచారం. బీఎస్పీ తెలంగాణ కో ఆర్డినేటర్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆ పార్టీని ఏపీలోనూ విస్తరింప చేసే బాధ్యతను ఆయనే తీసుకున్నాడు. స్వేరో స్ రూపంలో బలమైన నెట్ వర్క్ ను ప్రవీణ్ కుమార్ క్రియేట్ చేశాడు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయనే అంశాన్ని ప్రశాంత్ కిషోర్ గ్రహించాడు. ఇటీవల ఆయన చేసిన సర్వేల ద్వారా రాజకీయ శూన్యతను ఉత్తర భారత పార్టీలకు తెలియచేశాడట. ఆ క్రమంలో మమత బెనర్జీకి అండగా ఉన్న పీకే ఇప్పుడు ఆమెను తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు, బీసీలు బలంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుందట. యాదవ సామాజిక వర్గం ఏపీ, తెలంగాణాల్లో బలంగా ఉంది. బీసీ వర్గాల్లో బలమైన సామాజిక వర్గంగా యాదవులు ఉన్నారు. తెలంగాణాలో గౌడ సామాజిక వర్గం బలం అందరికీ తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ అధిపతులతో ఏపీ యాదవ సామాజిక వర్గం నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీలోని యాదవ సామాజికవర్గం నేతలు ఇటీవల విశాఖపట్నంలో సమావేశం అయ్యారు. ఆ సమావేశం ముగిసిన వారం తరువాత కోవిడ్ కు ఆయుర్వేద మందు ఇచ్చిన ఆనందయ్య కొత్త పార్టీ గురించి ప్రస్తావించాడు. యాదవ సామాజికవర్గం నాయకత్వంలో కొత్త పార్టీనా? ఎస్పీ పార్టీకి నాయకత్వం వహించడమా? అనే అంశం మీద సీరియస్ గా చర్చ జరుగుతోంది. యాదవ, గౌడ సామాజిక వర్గాలు సమాజ్ వాదీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నాయట. ఇప్పటికే కాపు, బలిజ సామాజిక వర్గానికి జనసేన పార్టీ పనిచేస్తోంది. బ్రహ్మణ నాయకత్వం పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉన్నప్పటికీ క్రమంగా మిగిలిన సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏపీలో కనుమరుగు అయింది. తెలంగాణలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో తటబడుతోంది. ఈ రెండు పార్టీలకు పోటీగా టీఎంసీని రంగంలోకి దింపడానికి పీకే రంగం సిద్ధం చేస్తున్నాడు. ఆ మేరకు మమతకు ఒక నివేదిక కూడా ఇచ్చాడని తెలుస్తోంది. కమ్మ, రెడ్డి, వెలమ సామాజికవర్గం నాయకత్వంలోని పార్టీలు ఇప్పటి తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న విషయం విదితమే.
తెలుగు రాష్ట్రాల్లోని దళిత, బీసీ, బ్రాహ్మణ లీడర్లు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీలను ఆశ్రయిస్తున్నారని టాక్. ఆ పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక నాయకులు నాయకత్వం వహించడం ద్వారా గెలుపు బాట పట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చి జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేల ఆధారంగా మాయ, మమత, అఖిలేష్ ఇటు వైపు చూస్తున్నారట. స్థానిక పార్టీలకు చెక్ పెట్టేలా ఎస్సీ, బీసీ, బ్రాహ్మణ సామాజికవర్గం నాయకత్వంలోని ఉత్తరాది పార్టీలు ఈసారి రంగంలోకి దిగడానికి ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాయట. బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ తరహాలో ఎస్పీ, టీఎంసీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం.