Janasena : `పొత్తు`ల రాయుడు
చాలా చాకచక్యంగా రాజకీయ పార్టీని నడుపుతోన్న పవన్ కల్యాణ్ మళ్లీ పొత్తుల అంశాన్ని బయటకు తీశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొత్తు అంశాన్ని పలుమార్లు రక్తికట్టిస్తూ జనం మూడ్ ను జనసేన వైపు తిప్పుకుంటున్నారు
- By CS Rao Updated On - 02:23 PM, Mon - 20 June 22

చాలా చాకచక్యంగా రాజకీయ పార్టీని నడుపుతోన్న పవన్ కల్యాణ్ మళ్లీ పొత్తుల అంశాన్ని బయటకు తీశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొత్తు అంశాన్ని పలుమార్లు రక్తికట్టిస్తూ జనం మూడ్ ను జనసేన వైపు తిప్పుకుంటున్నారు. ఆ విషయంలో చాలా వరకు ఆ పార్టీ సక్సెస్ అయింది. అందుకే, ప్రతి నెల, రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక పొత్తు ఆప్షన్ ను రాజకీయ చదరంగంపై వేస్తున్నారు. దానిపై కొన్ని రోజులు సీరియస్ చర్చ జరిగేలా వ్యూహం ప్రకారం పవన్ వెళుతున్నారు. ఆ క్రమంలో ప్రధాన పార్టీలు సైతం ఆయన మైండ్ గేమ్ లో పడిపోవడం గమనార్హం.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పొత్తులకు సంకేతం ఇచ్చారు. అంతేకాదు, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటూ ప్రకటించారు. ఆ తరువాత మరో నెల రోజులకు జరిగిన జనసేన పార్టీ విస్తృత సమావేశం సందర్భంగా పొత్తులపై మూడు ఆప్షన్లను వినిపించారు. బీజేపీ-జనసేన కలిసి వెళ్లడం, బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు, లేదంటే ఒంటరిగా జనసేన ఎన్నికల్లో నిలవడం అంటూ విడమరిచి చెప్పారు. తాజాగా కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా ప్రజలతో మాత్రమే పొత్తు ఉంటుందని వెల్లడించడం మరోసారి పవన్ వాలకం చర్చనీయాంశం అయింది.
నాన్ సీరియస్ పొలిటిషియన్ గా పవన్ ను తొలి నుంచి ప్రత్యర్థి పార్టీలు భావిస్తుంటాయి. అందుకు, బలం చేకూరేలా ఆయన కార్యక్రమాలు కూడా ఉండడం చూస్తున్నాం. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం కొన్ని సభలను పవన్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తానని గోదావరి జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో చెప్పారు. ఆ తరువాత అనంతపురం కేంద్రంగా ఒక సభను నిర్వహించడంతో ముగించారు. ఎన్నికల సందర్భంగా 2019 లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి పూనుకున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుని విశాఖ వరకు వెళ్లిన తరువాత రిసార్ట్స్ లో సేద తీరారు. ఆ తరువాత అడపాదడప కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని అప్పట్లో హైదరాబాద్ ఇంటికి చేరారు. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ ఓడిపోవడంతో పాటు 120 స్థానాల్లో డిపాజిట్లు కూడా ఆ పార్టీకి రాలేదు. గత మూడేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏడాదికి ఒకటో రెండో రోడ్ షోలు, సభలను పెట్టడం వరకు పరిమితం అయ్యారు.
దసరా తరువాత సీరియస్ పొలిటిషన్ గా మారతానని తాజాగా రైతు భరోసా సభలో వెల్లడించారు. ఆ సందర్భంగా పొత్తుల అంశాన్ని కూడా తేల్చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. పొత్తులు ప్రజలతో మాత్రమేనంటూ కొత్త లాజిక్ తీశారు. ఎల్లుండి ఎన్నికలు వచ్చినప్పటికీ సిద్ధమంటూ పొత్తులకు స్వస్తి పలికేలా ప్రసంగించారు. అధికారం లేకపోయినప్పటికీ ప్రశ్నించడానికి ఉంటామని క్యాడర్ కు విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. బహుశా బీజేపీ నుంచి వచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ఆయన సంకేతాలు ఇచ్చి ఉంటారు. పొత్తులకు ఓపెన్ ఆప్షన్లు మూడు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం నుంచి ఏ మాత్రం సానుకూల సంకేతం ఆయనకు లభించలేదు. దీంతో ప్రజలతో మాత్రమే పొత్తు అంటూ బీజేపీని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ ఒంటరిగా వెళతామంటూ పవన్ పరోక్షంగా చెప్పడం సరికొత్త ఈక్వేషన్ ఏపీ రాజకీయాల్లో తెరమీదకు వచ్చే అవకాశం లేకపోలేదు.
Related News

Chandrababu : రాజంపేటపై చంద్రబాబు ఫోకస్, ఎంపీ అభ్యర్థి ఆయనే?
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థిత్వాల విషయంలో ఒక క్లారిటీకొచ్చిన ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కొన్ని పేర్లను ప్రకటిస్తున్నారు. కేవలం గెలిచే ఎమ్మెల్యేల సంఖ్యపైనే కాదు, ఎంపీల సంఖ్యపై కూడా గురి పెట్టారు.