Kakani Issue : కోర్టులో కాకాణి ఫోర్జరీ ఫైల్స్ చోరీ కేసులో మరో ట్విస్ట్.. వాళ్లు కుక్కలకు భయపడి..!
నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ పాత నిందితులే అని చెప్పారు.
- By Hashtag U Published Date - 11:16 AM, Mon - 18 April 22

నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ పాత నిందితులే అని చెప్పారు. వాళ్లు ఇనప స్క్రాప్ ను దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదన్నారు. అసలు కథ ఇక్కడే మొదలైందా అని చాలామంది అనుమానపడుతున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్పిన నిందితుల్లో ఒకరు.. పధ్నాలుగు కేసుల్లో ముద్దాయి. అలాంటి వ్యక్తి కోర్టులో దొంగతనం చేయడానికి సాహసిస్తాడా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తు్న్నారు.
నిందితులకు 2010 నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్లొచ్చారు. అలాంటివాళ్లు కోర్టు ప్రాంగణంలో ఉన్న ఇనుప స్క్రాప్ ను దొంగతనం చేయడానికి పాల్పడతారా అన్న సందేహాలు ఉన్నాయి. అయినా ఇద్దరు దొంగలకు ఎంత ఇనుము మోసుకెళ్లే శక్తి ఉంటుంది? ఒకవేళ నిజంగానే ఇనుమును దొంగతనం చేయాలనుకుంటే.. నెల్లూరు నగరంలో నిర్మాణంలో ఉన్న చాలా కట్టడాలున్నాయి. అలాంటి చోట దొంగతనానికి పాల్పడేవారు కదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దొంగతనం చేయడానికి వచ్చినవారు.. ఆ సమయంలో అక్కడ కుక్కల మొరగడం వల్ల భయపడి.. కోర్టు లోపలికి వెళ్లారని పోలీసులు చెప్పారు. అయినా గత పుష్కరకాలంగా దొంగతం చేయడానికి అలవాటుపడ్డవారు కుక్కలు మొరిగితే భయపడతారా? పైగా వాళ్లిద్దరూ ఉంటోంది కూడా ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద. అలాంటివారికి కుక్కలంటే ఈ స్థాయిలో భయం ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
కుక్కలకు భయడి కోర్టులోని ఒకటవ అంతస్తులోకి వెళ్లినవారు.. సహజంగా అక్కడుండే వస్తువులను దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కాకాణి కేసులో ముఖ్యమైన సాక్ష్యాధారాలు మాయమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దొంగల అసలు ఉద్దేశమేంటి అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.