Kaleshwaram Project : మీరు కాళేశ్వరం కడితే తప్పులేదు..మీము బనకచర్ల కడితే తప్పేంటి..? – నారా లోకేష్
Kaleshwaram Project : బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే జల వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:26 PM, Thu - 31 July 25

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల (AP – Telangana) మధ్య జలవివాదాలు మరోసారి రాజుకుంటున్నాయి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో స్పందించారు. బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే జల వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. “మిగులు జలాలను వాడుకుంటే అభ్యంతరం ఏమిటి?” అని బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో అడ్డుపడుతున్న వారిని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకుంటే అందులో తప్పేంటని మంత్రి లోకేష్ నిలదీశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మించే ముందు అనుమతులు ఉన్నాయా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాజెక్టు కడితే, ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు వచ్చిన అభ్యంతరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చే నీటిని వాడుకుంటే తప్పేంటని, “ఏపీకి ఒక నీతి… తెలంగాణకు మరో నీతా?” అంటూ మంత్రి లోకేష్ నిశితంగా నిలదీశారు.
Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్‌కు గాయాలు
“కాళేశ్వరం ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా?” అని లోకేష్ ప్రశ్నిస్తూ, సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను లిఫ్ట్ చేసి బనకచర్ల (Banakacherla Project ) కడితే తప్పేంటని వాదించారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన పునరుద్ఘాటించారు. తాము తెలంగాణకు వచ్చే పెట్టుబడులను ఏనాడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై జరుగుతున్న వివాదాన్ని మరింత రాజేసే అవకాశం ఉంది.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా నెంబర్ వన్‌గా ఉండాలన్నదే టీడీపీ ఆకాంక్ష అని లోకేష్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తమ పార్టీకి ప్రాంతీయ భేదాలు లేవని, తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని లోకేష్ పరోక్షంగా తెలియజేశారు. అయితే, బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నాయకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై సమన్వయం సాధించడం ఎంతో అవసరం.