Toddy Death Politics : ‘సారా’ పోరు
ఒక్కో సందర్భంలో ఒక్కో ఘటన ప్రభుత్వాలను కూల్చేసిన సందర్భాలు అనేకం.
- By CS Rao Published Date - 02:46 PM, Wed - 23 March 22

ఒక్కో సందర్భంలో ఒక్కో ఘటన ప్రభుత్వాలను కూల్చేసిన సందర్భాలు అనేకం. ఉల్లిపాయల ధర పెరుదల ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని పడేసింది. ఉమ్మడి ఏపీలో అనేక మంది సీఎంలను మార్చేసిన సంఘటనలు అనేకం. ఇప్పుడు కల్తీసారా మరణాలు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి చుట్టుకునేలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పరిధిలో జరిగిన మరణాలను సహజమైనవిగా జగన్ సర్కార్ చెబుతోంది. అవి, కల్తీసారా మరణాలు అనడానికి అనేక ఆధారాలు స్థానికుల లభిస్తున్నాయి.విపక్షాలు వారం రోజులుగా జంగారెడ్డిగూడెం మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కల్తీ సారా మరణాలని అసెంబ్లీ లోపల వాదించింది. బయట బాధిత కుటుంబాలకు అండగా ఆందోళన కు దిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ సారా మరణాలపై వరుసగా ఏడవ రోజు కూడా టీడీపీ నిరసన తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్ష నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కల్తీ సారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీని జగన్ ఇచ్చాడు. కానీ, మూడేళ్లుగా మద్యం విక్రయాలను పెంచడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు. అందుకే, మద్యనిషేధంపై అసెంబ్లీలో చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీ సచివాలయంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి వరకు టీడీపీ ర్యాలీ నిర్వహించింది. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో ప్రజలు చనిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.కల్తీసారా మరణాలపై ఆందోళనకు దిగిన 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాల నేపధ్యంలో విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. ఇటీవల జంగారెడ్డిగూడెంలో సుమారు 25 మంది నాటుసారా తాగి మరణించారని టీడీపీ ఆరోపిస్తుంది.మరోవైపు అధికార వైసీపీ ప్రభుత్వం మాత్రం అవి సహజమరణాలేనని, కావాలనే టీడీపీ శవరాజకీయాలు చేస్తుందని తిరగబడుతోంది. సారా మరణాలపై టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గద్దె రామ్మోహన్,అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, బొండా ఉమ తదితరులను ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గతంలో అనేక అంశాలపై పోరాడిన లోకేశ్ ఈసారి కల్తీ సారా మరణాలపై జగన్ సర్కార్ మెడలు వంచాలని భావించాడు. వారం నుంచి వరుసగా వివిధ రూపాల్లో ఆందోళనకు దిగాడు. గతంలోనూ పదో తరగతి పరీక్షల రద్దుపై జూమ్ ద్వారా పోరాటం చేసి జగన్ సర్కార్ పై గెలుపొందాడు. ఇప్పుడు కల్తీసారా మరణాలపై పోరాటం చేస్తోన్న ఆయన నిజనిర్థారణ చేయడానికి సిద్ధం అయ్యాడు. సిట్టింగ్ జడ్జి లేదా ఇతరత్రా ఇన్విస్టిగేషన్ సంస్థలతో విచారణ జరిపించాలని పట్టుబడుతున్నాడు. సో..అంతిమంగా ప్రభుత్వం దిగొస్తుందా? సహజ మరణాల కింద జమకడుతుందా? అనేది చూడాలి.