Pithapuram : పిఠాపురంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయా..?
Pithapuram : స్థానిక జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు మాత్రం ఆయన ఇక్కడి రాజకీయాల్లో ప్రభావం కొనసాగించాలని కోరుకుంటున్నా, వర్మ వంటి నేతలు ఎదురుతిరిగితే సమస్యలు తలెత్తే అవకాశముంది
- By Sudheer Published Date - 08:06 PM, Sat - 5 April 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడినుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) పిఠాపురంలో ప్రారంభించిన పర్యటనతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ(Varma)ను భావిస్తున్నారు. పార్టీ టికెట్ ఆశించి చివరికి మళ్లీ ఏం దక్కకపోవడంతో వర్మ తీవ్ర అసంతృప్తికి లోనై, జనసేనపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
Peddi Glimpse : ‘పెద్ది’ గ్లింప్స్ లీక్ చేసిన రామ్ చరణ్
వర్మ అసంతృప్తి నేపధ్యంలో ఆయనను శాంతింపజేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును రంగంలోకి దించారు. దీంతో నాగబాబు రెండు రోజులుగా పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజల మద్దతును ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండడమే కాకుండా, తన అనుచరులతో “గో బ్యాక్ నాగబాబు” నినాదాలు చేయిస్తూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇదంతా చూస్తూ టీడీపీ అధిష్టానం మౌనం వహిస్తుండటంతో, వర్మకు వారి మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ సంఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యూహం విజయవంతమవుతుందా లేక తిరస్కారానికీ గురవుతుందా అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. స్థానిక జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు మాత్రం ఆయన ఇక్కడి రాజకీయాల్లో ప్రభావం కొనసాగించాలని కోరుకుంటున్నా, వర్మ వంటి నేతలు ఎదురుతిరిగితే సమస్యలు తలెత్తే అవకాశముంది. టీడీపీ అధికారికంగా స్పందించకపోయినా, వర్మను సర్దిచేయడంలో విఫలమైతే అది కూటమికి నష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో పిఠాపురం రాజకీయ గణితంలో మార్పులు తథ్యమవుతున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.