Minister Seediri Appalraju: ఎన్నికల అధికారిని బెదిరించిన వైసీపీ మంత్రి అప్పల్రాజు
వైసీపీ మంత్రి సీదిరి అప్పల్రాజు ఎన్నికల అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ మంత్రి ఎన్నికల అధికారులను బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Author : Praveen Aluthuru
Date : 27-04-2024 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Seediri Appalraju: వైసీపీ మంత్రి సీదిరి అప్పల్రాజు ఎన్నికల అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ మంత్రి ఎన్నికల అధికారులను బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పలాస నియోజకవర్గం నుంచి అప్పల్రాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం విదితమే. కాగా శుక్రవారం ఆయన ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంత్రి వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
ప్రచార వాహనం ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఓ అధికారి ఆశలత మంత్రికి వివరించారు. అయితే మంత్రి అప్పల్రాజు ఆగ్రహంతో ఊగిపోయి తన అనుచరులతో వాహనం మరియు లక్ష రూపాయలు ఆమెకు అప్పగించండి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరోసారి తన ప్రచార రథాన్ని ఆపితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆమె ఒక్కరే ఎన్నికల డ్యూటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు.
అయితే మంత్రి పద్దతిని పలువురు తప్పు బడుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలైతే ఎంతటి రాజకీయ నేతనైనా ప్రశ్నించే హక్కు ఎన్నికల అధికారులకు ఉంటుంది. వారి వాహనాన్ని ఏ సమయంలోనైనా ఆపి, తనిఖీ చేసే అధికారం ఉంది. మరోవైపు మహిళా అధికారి పట్ల అప్పల్‌రాజు అగౌరవ వైఖరిని ఖండించారు నెటిజన్లు. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
Also Read: LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!