Privatisation Issue: ప్రైవేట్ కాదు, పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు: లోకేష్ స్పష్టీకరణ
జీఎస్టీ కొత్త విధానం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దానివల్ల మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగి, ఆర్థిక పురోగతి జరుగుతుందని తెలిపారు.
- By Dinesh Akula Published Date - 08:24 PM, Mon - 22 September 25

అమరావతి, సెప్టెంబర్ 22: (Nara Lokesh) మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇవి పూర్తిగా ప్రైవేట్ కాలేజీలు కావని, ప్రజా ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో (PPP మోడ్) ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ తన ఛాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లు కూడా ఇదే విధానంలో నిర్మిస్తున్నామని తెలిపారు.
పులివెందులలో సీఎం జగన్ కనీసం ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని విమర్శించారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో, శాసన మండలిలో క్లియర్‌గా వెల్లడిస్తామన్నారు. జగన్ పాలన “అమ్మ అన్నం పెట్టదు, అడుక్కు తిననివ్వదు” అన్నట్టుందని విమర్శించారు.
1994లో చంద్రబాబు కాంగ్రెస్ మాట విని ఉండి ఉంటే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఈ స్థాయిలో ఉండేవి కావు అన్నారు. ఇదే విజనరీకి, ప్రిజనరీకి తేడా అని తెలిపారు. టీసీఎస్‌ను విశాఖపట్నానికి తీసుకురావడంలో పురోగతి సాధించామని, ఇప్పటికే రిక్రూట్‌మెంట్ ప్రారంభమైందని చెప్పారు.
జీఎస్టీ కొత్త విధానం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దానివల్ల మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగి, ఆర్థిక పురోగతి జరుగుతుందని తెలిపారు. పన్నులు చెల్లించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. మూడు నెలల కాలేజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని తెలిపారు. జగన్ హయాంలో ఉన్న మిగిలిన మూడు నెలల బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, తమ హయాంలో ఉన్న బకాయిలను వెంటనే క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో DSC నిర్వహిస్తామని చెప్పారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టిందన్నారు: స్పష్టమైన ఒప్పందం కాకుండా వెంటనే గ్రౌండ్‌వర్క్ చేయడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి వివరించడం.
టీసీఎస్‌కు మిలీనియం బ్లాక్‌లో స్థలం ఇచ్చినట్టు, మిగతా కంపెనీలకూ ఇదే విధంగా ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు.
2023 ఏప్రిల్ 29 రాత్రి తిరుపతి పరకామణిలో జరిగిన చోరీపై మాట్లాడుతూ, వెంటనే చార్జిషీట్ వేసిన విధానం చూస్తే కేసు ముందే సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుందని అన్నారు. అంత పెద్ద నేరానికి 41CRPC నోటీస్ మాత్రమే ఇవ్వడం విచారకరం అని చెప్పారు. ఈ కేసులో దేవుడే నిజాన్ని బయటకు తెచ్చాడని వ్యాఖ్యానించారు. పరకామణి చోరీపై SIT విచారణను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని నిరూపితమైందని, అసలు నెయ్యే లేదని తేలిందని మంత్రి లోకేష్ వెల్లడించారు.