Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
- By Kode Mohan Sai Published Date - 02:41 PM, Fri - 15 November 24

Maharashtra Elections 2024: ఎన్‌డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు అప్పజెప్పేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో, బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలోకి ఆహ్వానించింది. ఎన్‌డీఏ కూటమి తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్‌ను కోరింది బీజేపీ.
బీజేపీ అభ్యర్థన మేరకు, పవన్ కళ్యాణ్ నవంబర్ 16 మరియు 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రకటన జనసేన పార్టీ విడుదల చేసింది, ఇందులో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ప్రధానంగా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. బీజేపీ జాతీయ నాయకులు మరియు మహారాష్ట్ర రాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ ప్రచార షెడ్యూల్ ఖరారైందని జనసేన పార్టీ తెలిపింది.
ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగా శ్రీ @PawanKalyan గారు మహారాష్ట్రలో ప్రచారం
రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన
5 సభలు… 2 రోడ్ షోలు pic.twitter.com/4IPDDcwSwO
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2024
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో మరియు రెండు రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఆయన మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
16వ తేదీ (నవంబర్ 16):
- ఉదయం: నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలోని బహిరంగ సభలో పాల్గొంటారు.
- తరువాత: భోకర్ నియోజకవర్గంలో మరో సభలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం: లాతూర్ చేరుకుని అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు.
- సాయంత్రం 6 గంటలకు: షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.
17వ తేదీ (నవంబర్ 17):
- ఉదయం: విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్ జిల్లా బల్లార్ పూర్ పట్టణంలో బహిరంగ సభలో పాల్గొంటారు.
- సాయంత్రం: పుణె కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
- అనంతరం: కస్బా పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న జరుగనుండగా, ఫలితాలు నవంబర్ 23న విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంలో ఎన్డీయే కూటమి తరుపున పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయింది.