Amaravati Maha padyatra: రేపే అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు అత్యంత ఉత్సాహంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
- By HashtagU Desk Published Date - 12:30 PM, Sun - 11 September 22

అమరావతి రైతుల మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు అత్యంత ఉత్సాహంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
అమరావతి ఉద్యమం మొదలుపెట్టి వెయ్యి రోజులు అవుతున్నసందర్భంగా రేపు వారు అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
శాంతిభద్రతల ముప్పు తలెత్తే అవకాశం ఉందని పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించారు. రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనుమతించింది. దాంతో రేపు సోమవారం వేకువజామున 5 గంటలకు వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి మహాపాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథానికి ఉదయం 9 గంటలకు జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తారు. యాత్ర తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీ,జనసేన, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.
Cover Pic: File Photo