Lemon Prices: ఏలూరు మార్కెట్ దయతలిస్తేనే.. దేశంలో నిమ్మకాయల ధర తగ్గుద్దా? అప్పటివరకు ఒక్కో కాయ రేటు రూ.20 పైనే!
తాగకుండానే నిమ్మకాయ పులుపు ఒళ్లు ఝల్లు మనేలా చేస్తోంది. సి విటమిన్ ఉంటుంది కదా అని ఓ గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగుదామనుకుంటే..
- By Hashtag U Published Date - 09:30 AM, Tue - 12 April 22

తాగకుండానే నిమ్మకాయ పులుపు ఒళ్లు ఝల్లు మనేలా చేస్తోంది. సి విటమిన్ ఉంటుంది కదా అని ఓ గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగుదామనుకుంటే.. కష్టమే. ఎందుకంటే ఒక్క నిమ్మకాయ ఖరీదే దాదాపు రూ.20 పలుకుతోంది. కరోనా తరువాత అందరూ నిమ్మకాయలను జుర్రేశారు. కానీ ఇప్పుడు ఒక్క నిమ్మకాయ కొనాలన్నా పదిసార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు మార్కెట్ తలుచుకుంటే.. మళ్లీ నిమ్మ రేటు తగ్గుతుంది. ఇంట్లో లెమన్ జ్యూస్ దొరుకుతుంది.
నెల కిందట కేజీ నిమ్మకాయల రేటు రూ.70-80. కానీ ఇప్పుడు రూ.300-400. దీని ధర ఒక్క నెలలోనే దాదాపు ఆరు రెట్లు ఎందుకు పెరిగింది అంటే చాలా లెక్కలు తీయాలి. ముందుగా ఏపీలోని ఏలూరు మార్కెట్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద నిమ్మ మార్కెట్ ఏలూరులోనే ఉంది. దేశానికి అవసరమైన నిమ్మకాయల్లో దాదాపు 40-45 శాతం ఈ మార్కెట్టే తీరుస్తోంది.
ఏపీలో భూములు.. నిమ్మకాయల పెంపకానికి అనువుగా ఉంటాయి. వీటికి తరచుగా నీటిని పెట్టక్కరలేదు. మొక్క నాటిన 3-4 ఏళ్ల తరువాత ఉత్పత్తి మొదలవుతుంది. ఆపై ఐదేళ్ల వరకు నిమ్మ పంట వస్తూనే ఉంటుంది. ఏలూరు మండీలో దాదాపు 20 వేల మంది నిమ్మకాయల రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారంటేనే అక్కడ ఆ పంట ఏ స్థాయిలో పండుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఏలూరు మార్కెట్ నుంచి రోజూ 25 ట్రక్కుల నిమ్మకాయల లోడ్లు దేశంలో వివిధ ప్రాంతాలకు వెళతాయి. ఒక్కో ట్రక్కులో 21 టన్నుల నిమ్మకాయలు ఉంటాయి. అలాంటి ఈ మార్కెట్ నుంచి ఇప్పుడు కనాకష్టంగా ఐదు ట్రక్కుల నిమ్మకాయలే సరఫరా అవుతున్నాయి. మామూలు సీజన్ తో పోల్చి చూసినా ఐదు రెట్లు తక్కువ. అందులోనూ వేసవి కాలంలో వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా రేటు గూబ గుయ్యిమనేలా పెరిగింది.
కరోనా వల్ల 2020లో లాక్ డౌన్ కారణంగా మార్కెట్లు తెరవలేదు. దీంతో నిమ్మసాగు చేసిన రైతులు నష్టపోయారు. పైగా గత ఏడాది భారీ వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. దీంతో ఒక్కో టన్ను నిమ్మ ధర రూ.5 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగింది. ఏపీలో బాలాజీ జిల్లాలోని గూడూరు మండి, రాజమహేంద్రవరం మండీల నుంచీ నిమ్మ పంట ఎక్కువగా సరఫరా అవుతుంది. అటు అహ్మదాబాద్ లోని జమల్ పూర్, కలుపూర్, రాజస్థాన్ లోని పాలివాల్ ప్రాంతాల్లోనూ నిమ్మ సరఫరా ఎక్కువే. అయినా ఇప్పుడు కొరత తప్పలేదు.