Kurnool Tour: చంద్రబాబు ఫుల్ జోష్! కర్నూలు బూస్టప్!!
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు.
- Author : CS Rao
Date : 18-11-2022 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు. కర్నూలు లీడర్లు కేఈ, కోట్ల, భూమా, గౌరు ఐక్యంగా చంద్రబాబు వద్ద నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ స్వీప్ అనేంతగా స్పందన లభించిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఇదంతా పైకి కనిపించిన దశ్యం. కానీ, రెండు చేదు అనుభవాలు చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆ పార్టీని వెంటాడాయి.
విశేషంగా హాజరైన జనాన్ని చూసిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇవే చివరి ఎన్నికలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీకి వెళతాను. లేదంటే ఏపీని ఆదుకోలేనంటూ కామెంట్లు చేశారు. కానీ, ఆ వ్యాఖ్యలను వైసీపీ మరో రకంగా ఏపీ సమాజం ముందుకు తీసుకెళ్లడం సంచలనం కలిగిస్తోంది. ఏడాదిన్న ముందే ఓటమిని చంద్రబాబు అంగీకరించారని ఆయన కామెంట్లను మరో కోణం నుంచి తీసుకెళుతున్నారు. కర్నూలు పర్యటనలో ఇదే మైనస్ పాయింట్ గా టీడీపికి నిలిచిపోయింది.
Also Read: Ananthapuram TDP: బలం, బలహీనత వాళ్లే!
మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో కర్నూలు వెళ్లిన చంద్రబాబును అక్కడి న్యాయవాదులు అడ్డుకున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ, ఆ మేరకు కేంద్రానికి, సుప్రీం కోర్టుకు లేఖ రాయాలని ఆయన ఎదుట డిమాండ్ ఉంచారు. లేదంటే నిరసన వ్యక్తం చేస్తామంటూ ప్ల కార్డులను న్యాయవాదులు ప్రదర్శించారు. శ్రీ బాగ్ ఒప్పందాన్ని గుర్తు చేస్తూ కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ కు తరలించే సమయంలో జరిగిన అంశాలను తిరగతోడారు. కానీ, చంద్రబాబు మాత్రం అమరావతి ఏకైక రాజధాని అనే నినాదానికి కట్టుబడి ఉన్నారు. అంతేకాదు, 2019 ఎన్నికల సందర్భంగా హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టేందుకు మాత్రం ఇప్పటికీ ఆయన సానుకూలంగా ఉన్నారు. న్యాయవాదులు చంద్రబాబును నిలదీయడం కర్నూలు పర్యటనలోని మరో మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది.
మూడు రోజుల చంద్రబాబు పర్యటన శనివారంతో ముగుస్తోంది. తొలి రెండు రోజులు చంద్రబాబు టూర్ అనూహ్యంగా
విజయవంతం అయింది. చివరి రోజు నాయకులతో సమీక్షిస్తారు. గ్రూపులకు చెక్ పెట్టడంతో పాటు అమరావతి రాజధానికి అనుకూలంగా కర్నూలు జిల్లా టీడీపీలో తీర్మానం చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. కొందరికి సంకేతాలు ఇవ్వడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేసే దిశానిర్దేశం చేసి శనివారం తిరిగి హైదరాబాద్‌కు చంద్రబాబు చేరుకుంటారు.
Also Read: Kavitha TRS: బీజేపీ ఆపరేషన్లో తెలంగాణ లేడీ షిండే