Krishna District : హే కృష్ణా..`ఇదేం ఖర్మ రాష్ట్రానికి..`
ఏపీలోని మిగిలిన జిల్లాలకు కృష్ణా(Krishna District) జిల్లా రాజకీయానికి భిన్నత్వం ఉంది.
- By CS Rao Published Date - 02:26 PM, Thu - 6 April 23

ఏపీలోని మిగిలిన జిల్లాలకు కృష్ణా(Krishna District) జిల్లా రాజకీయానికి భిన్నత్వం ఉంది. అక్కడి నాయకుల్లో చైతన్యంతో పాళ్లు ఎక్కువ. అధిష్టానాన్ని సైతం ఆడించగల సమర్థులు ఉన్నారు. అందుకే, కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాన్ని సెట్ చేయడానికి చంద్రబాబు(Chandrababu) చతురత కూడా పనిచేయడంలేదు. రెండుసార్లు ఆ జిల్లా పర్యటన ఇటీవల వాయిదా పడింది. ఒకసారి అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్న తరుణం. మరోసారి వాతావరణ సానుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. ఈ సారి ఏప్రిల్ 12వ తేదీన `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను ఆ జిల్లాలో షెడ్యూల్ చేయడంతో ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెరిగింది.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ (krishna District)
సాధారణంగా `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను ప్రతి జిల్లాలో మూడురోజులు పెట్టారు. ఒక రోజు రోడ్ షో, రెండోరోజు జిల్లా నాయకులతో సమన్వయ సమావేశం, మూడో రోజు బహిరంగ సభలతో ముగిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు కేంద్రాల్లో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట కారణంగా పలువురు మృతి చెందారు. ఆ కారణంగా జీవో నెంబర్ 1ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. దీంతో తాత్కాలికంగా `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ఆగిపోయింది. తిరిగి ఆ ప్రోగ్రామ్ ను ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District) నుంచి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
టీడీపీ షెడ్యూల్ ను ఖరారు
ఈ నెల 12న నూజివీడులో రోడ్ షో నిర్వహించడం ద్వారా `ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..`పునఃప్రారంభం అవుతుంది. మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని నియోజకవర్గం గుడివాడలో 13న చంద్రబాబు(Chandrababu) రోడ్ షో, బహిరంగ సభ ఉంటుంది. ఆ రోజు రాత్రి( 13వ తేదీ) నిమ్మకూరులో ఆయన బస చేస్తారు. మరసటి రోజు (ఏప్రిల్ 14న) మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఆ మేరకు టీడీపీ షెడ్యూల్ ను ఖరారు చేసింది.
Also Read : Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
మూడు రోజుల పాటు ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మూడు పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే చంద్ర బాబు పర్యటించనున్న ప్రాంతాల్లో పార్టీ జెండాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఆ జిల్లాలోని(Krishna District) గుడివాడ, గన్నవరం, మైలవరం, విజయవాడ సెంట్రల్, పామర్రు తదితర అసెంబ్లీ నియోజవర్గాలు మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థిత్వాల మీద అస్పష్టత ఉంది. దానికి చంద్రబాబు(Chandrababu) క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్రా వ్యాప్తంగా ఆయన పర్యటనకు వెళ్లినప్పుడు అభ్యర్థిత్వాలపై స్పష్టతను ఇస్తూ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంచార్జిలు ఉన్నప్పటికీ ఏపీ వ్యాప్తంగా సుమారు 40 చోట్ల అభ్యర్థుల ఖరారుపై తికమక నెలకొంది. వాటిలో కృష్ణా జిల్లాలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం.
Also Read : PK-Jagan-CBN : BJP కర్ణాటక గేమ్,APఅగ్ర నేతలపై ఢిల్లీ రైడ్!