Kirankumar Reddy : విభజన గాయంపై కిరణ్ గేమ్
రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను(Kirankumar Reddy) ఏపీ ప్రజలు ద్వేషిస్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీని దూరంగా పెడుతున్నారు.
- Author : CS Rao
Date : 01-06-2023 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను(Kirankumar Reddy) ఏపీ ప్రజలు ద్వేషిస్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీని దూరంగా పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పాతరేశారు. అంతేకాదు, అన్యాయం చేసిన పార్టీగా బీజేపీని కూడా దగ్గరకు రానివ్వడంలేదు. కానీ, ఏదో ఒక రకంగా ఏపీ ఓటర్లను ఆకర్షించాలని కాంగ్రెస్, బీజేపీ (BJP) ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, తెలంగాణలో ఒక వాదం, ఏపీలో మరో వాదం వినిపించడం ఆ పార్టీలకు అనివార్యం అయింది. అందుకే, విభజన గాయం మానకముందే ఏదో ఒక రూపంలో రేగుతోంది. ఫలితంగా కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో స్థానం లేకుండా పోయింది.
రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను(Kirankumar Reddy)
తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకోవలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. అందుకోసం వచ్చే ఎన్నికల స్లోగన్లను తయారు చేస్తోంది. అంతే వేగంగా బీజేపీ కూడా రాష్ట్రాన్ని ఇవ్వడానికి సంపూర్ణ సహకారం అందించిన పార్టీగా ఎన్నికల అస్త్రాలను తయారు చేసుకుంది. ఈ రెండు పార్టీల వాలకాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందస్తుకు వెళ్లడానికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి (Jagan mohan Reddy) పొందినట్టు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజు ముందస్తు సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారని పార్టీ క్యాడర్ భావిస్తోంది.
బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఫోకస్
ఇరు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే, తెలంగాణలో రాష్ట్రం ఇచ్చిన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రచారం చేసుకుంటాయి. అవే స్లోగన్స్ ఏపీలో చేస్తే, నామరూపాల్లేకుండా పోతాయి. ప్రస్తుతం బీజేపీ పొత్తు కోసం టీడీపీ సిద్ధంగా ఉంది. ఒక వేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వెళితే, విభజన గాయం ప్రతికూల అంశాలు ఆ కూటమిని వెంటాడుతాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీ మునిగిపోయింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ మీద ఏపీ ఓటర్ల కసి మరింత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఫోకస్ అయితే, దానికి పొత్తు పెట్టుకున్న కూటమి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఉత్పన్నం అవుతుంది.
కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ ద్రోహిగా
ఏపీ బీజేపీకి ఆశాకిరణం మాదిరిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) కనిపిస్తున్నారు. రాజకీయంగా నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన కుటుంబం చిత్తూరు జిల్లాకు పరిమితం. అలాంటి ఆయన్ను ఏపీ బీజేపీ ఇప్పుడు నమ్ముకుంది. ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా ఆయన రికార్డ్ ల్లో పదిలంగా ఉన్నారు. ఆనాడు అసెంబ్లీని రద్దు చేయకుండా విభజన బిల్లును ఆమోదించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఒక వేళ అసెంబ్లీని రద్దు చేసి ఉంటే, మధ్యంతర ఎన్నికలకు వచ్చేవి. అప్పుడు రాష్ట్రం విడిపోకుండా ఉండేదని ఏపీ ప్రజల అభిప్రాయం. అందుకే, కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ ద్రోహిగా భావిస్తుంటారు. దాని ఫలితాన్ని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన రుచిచూశారు. ఇప్పుడు మళ్లీ ఏపీ ఓటర్ల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Kiran kumar Reddy : బీజేపీలో పదవిలేని కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర విభజనను స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. లేదంటే, 2009 ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. సీడబ్ల్యూసీ మీటింగ్ లో విభజనను అడ్డుకున్నారు. ఫలితంగా 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని కాంగ్రెస్ నాయకులు చాలా మంది చెబుతుంటారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణం తరువాత కేసీఆర్ రోడ్ల మీద చురుగ్గా ఉద్యమాన్ని లేవనెత్తారు. అనుభవం ఉన్న రోశయ్య సీఎంగా ఉన్నప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. ఆ తరువాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) పదవిని కాపాడుకోవడం కోసం ఉమ్మడి ఏపీని విడగొట్టడానికి సహకారం అందించారు. మోజార్టీ లేకపోయినప్పటికీ సీఎం హోదాలో అందర్నీ ఐక్యం చేసి ఏకగ్రీవంగా రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ వేదికగా ఆమోదించిన ఘనత ఆయనది. అలాంటి లీడర్ ను ఏపీ ప్రజలు ఆదరించడానికి సిద్దంగా లేరని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీని కిరణ్ కుమార్ రెడ్డి ఆదుకోవడం పగటికల.
రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే, జాతీయ పార్టీలకు ఏపీలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అదే బీఆర్ఎస్, వైసీపీకి కలిసి వచ్చే అంశం. అందుకే, ముందస్తు దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
Also Read : AP BJP : మాజీ మంత్రి కొడాలి నాని జైలుకే.. BJP కండీషన్స్ అప్లై..!