Jr NTR Politics Entry : ‘ప్రీ’ పొలిటికల్ ‘RRR’
త్రిబుల్ ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వినిపించిన జూనియర్ మాటలు భవిష్యత్ రాజకీయానికి బాట వేసినట్టు ఉన్నాయి.
- By CS Rao Published Date - 01:56 PM, Sun - 20 March 22

త్రిబుల్ ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వినిపించిన జూనియర్ మాటలు భవిష్యత్ రాజకీయానికి బాట వేసినట్టు ఉన్నాయి. సాటి హీరో రాంచరణ్ పై చూపిన ప్రేమ జీవితాంతం తోడుగా ఉండాలని చేసిన విజ్ఞప్తి ని గమనిస్తే జూనియర్ ముందు చూపు అర్థం అవుతోంది. అంతే కాదు, డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన స్పీచ్ కూడా జూనియర్, రాంచరణ్ మధ్య బంధాన్ని ధృడం చేసేలా ఉంది. మెగా కుటుంబాన్ని, నందమూరి ఫ్యామిలీ మెంబర్ జూనియర్ ను జీవితాంతం కలిపి ఉండేలా ఆ వేదికను తీర్చిదిద్దారు. త్రిబుల్ ఆర్ సినిమాకే కాదు , టాలీవుడ్ కు మేలు చేయడానికి చిరంజీవి ఒక మెట్టు దిగి జగన్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు అని కృతజ్ఞత పూర్వకంగా చేతులు ఎత్తి దండం పెట్టాడు. ఆయన సినిమా బిడ్డ కాదు..సినిమా పెద్ద అంటూ రాజమౌళి కితాబు ఇచ్చాడు. సినిమా పెద్ద ఎవరు అనే విషయంలో ఎప్పుడు టాలీవుడ్ లో గందరగోళం ఉంటుంది. ఆ మాట అనగానే ఏదో ఒక రూపంలో మంచు, బాలయ్య అనుచరులు ప్రతి దాడిగి దిగిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఏకంగా రాజమౌళి కర్ణాటక వేదికగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా పెద్దగా చిరంజీవిని ఫోకస్ చేయటం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇష్యూగా మారింది. పైగా జూనియర్ ఉన్న వేదికపై బాలయ్య, మోహన్ బాబును కాదని చిరంజీవి టాలీవుడ్ మెగా పెద్ద అంటూ ప్రకటించటం రాజమౌళి చేసిన సాహసమే. ఇక సినిమా పెద్ద విషయంలో చర్చ లేకుండా ఉండేలా టాప్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి ప్రకటించేశాడు. మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా టిక్కెట్లు ధరల పెంపు ప్రయత్నం ఎవరు చేయలేదు. ఆయన ఏపీ సీఎం జగన్ ను మూడుసార్లు కలిశాడు. మూడో సారి చేతులు జోడించి జగన్ ను అభ్యర్దించాడు. ఆ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేనాని పవన్ కూడా రాజకీయ వేదికలపై చిరు చేసిన అభ్యర్ధన పై అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. ఆ అభ్యర్ధనలో ఉన్న టాలీవుడ్ భవిష్యత్ కోణాన్ని రాజమౌళి బయటకు తీసాడు. టాలీవుడ్ బిడ్డ కాదు..పెద్దగా ఆ దృశ్యాన్ని గుర్తు చేస్తూ నందమూరి , మెగా అభిమానుల గుండెల్లోకి చిరంజీవి ని లోతుగా తీసుకెళ్లాడు.
మెగా, నందమూరి అభిమానులు కలిసి చేసుకున్న పండుగ త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ . లక్షల మంది హాజరైన ఆ ఫంక్షన్ జూనియర్ రాజకీయ భవిష్యత్ పండుగ మాదిరిగా స్పీచ్ వినిపించింది. ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం (బీజేపీ) బసవరాజ్, ఆరోగ్యశాఖ మంత్రి హాజరు కావడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించు కుంది. నందమూరి కుటుంబంతో తొలి నుంచి బీజేపీ సన్నిహితంగా ఉంటుంది. 2014 ఎన్నికల సందర్భంగా బాలయ్య పై ప్రత్యేక అభిమానాన్ని మోడీ చాటిన విషయం తెలిసిందే. ఆనాడు జరిగిన ఎన్నికల ప్రచార వేదికలపై స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ను మోడీ పలు విధాలుగా ప్రస్తావించాడు. ఇప్పుడు టీడీపీకి దూరంగా బీజేపీ ఉంటున్నప్పటికీ నందమూరి కుటుంబంపై కమలనాథులకు అభిమానం ఉంది. పైగా జూనియర్ స్పీచ్ లో కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. ఇవన్నీ గమనిస్తే జూనియర్ రాజకీయ ప్రవేశానికి రాజమౌళి తిరుగులేని బాట వేస్తున్నట్టు కనిపిస్తోంది.
చిరంజీవికి పెద్దరికాన్ని ఇవ్వటం ద్వారా బాలయ్యను రాజకీయంగా వెనక్కి నెట్టే ప్రయత్నం జరిగిందని టీడీపీలోని నారా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ మొదలు పెట్టారు. ఇక రాంచరణ్ , జూనియర్ లను టాలీవుడ్ టాప్ హీరోలు గానే కాకుండా ప్రత్యేకమైన బంధం వాళ్ల మధ్య ఉందని చెప్పాడు. దీని ద్వారా రాంచరణ్, జూనియర్ కలిసి ఎప్పుడు ఒకే వేదికపై ఉంటారని అభిమానులకు క్లూ ఇచ్చాడు. రాముడు, భీముడు అంటూ వాళ్ళ బలాలు, బలహీనతలు గురించి రాజమౌళి వివరించాడు. హనుమాన్ తో పోల్చుతూ రాం చరణ్ ను ఆకాశానికి ఎత్తాడు. అంటే పవన్ కళ్యాణ్ ఫేమ్ కంటే చరణ్ లో చాలా ఉందని పరోక్షంగా గుర్తు చేసాడు. ఇక జూనియర్ ను రాముడులా అన్ని తెలిసిన వాడని రాజమౌళి కితాబు ఇచ్చాడు. బలాలు, బలహీనతలపై చక్కగా అవగాహన ఉన్న హీరోగా జూనియర్ ని ఫోకస్ చేసాడు. ఇదంతా చూస్తుంటే రాబోవు రోజుల్లో రామ్ చరణ్ మద్దతు తో జూనియర్ భవిష్యత్ పొలిటికల్ ఎంట్రీ కనిపిస్తోంది. పైగా అశేషం గా హాజరైన నందమూరి, మెగా ఫాన్స్ మధ్య ఇదంతా జరిగింది. ఆ ఈవెంట్ చూసిన పవన్ వీరాభిమానులు, నారా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అప్పుడే అలెర్ట్ అయ్యారు. సినిమా వరకే కాదు ఎప్పుడు తన వెంటే ఉండాలని చరణ్ ను జూనియర్ హగ్ చేసుకొని కోరడం గమనిస్తే భవిష్యత్ రాజకీయ అడుగులు సీరియస్ గా వేస్తున్నాడని అర్థం అవుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నందమూరి, మెగా సామాజిక వర్గాలు రాజకీయంగా బలమైనవి. వాళ్ళు కలిసి ఒకే వేదిక పైకి వస్తే తిరుగులేని విజయాన్ని సినిమాల్లోనే కాదు, రాజకీయంగా కూడా సంచలనాలు రేపే సత్తా ఉంది. అందుకే , ఇప్పటి నుంచే జూనియర్ రాజకీయ అడుగులు జాగ్రత్తగా వేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి రాజమౌళి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తున్నట్టు త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్పీచ్ లోని ఆంతర్యాన్ని విశ్లేషిస్తే అర్థం అవుతోంది. అంతే కాదు ఆ సినిమాల్లో చూపిన జెండాలు వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది. కేవలం ట్రైలర్ మాత్రమే విడుదల అయింది. ఈ నెల 25న విడుదల అయిన తరువాత సినిమాలో ఏ విధంగా రాజకీయ కోణాన్ని జెండా ల రూపంలో చూపారో..ఆసక్తికరం. ట్రైలర్ లో మాత్రం యెల్లో జెండాతో జూనియర్ సంబరాలు చేసుకున్నట్టు ఉంది. మిక్స్డ్ కలర్ ఉన్న జెండా రాం చరణ్ చేతిలో ఉంది. ఈ జెండాలు, త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్పీచ్ లు జూనియర్ భవిష్యత్ రాజకీయ కోణాన్ని చూపుతున్నాయని ప్రాధమికంగా అర్థం అవుతుంది. సినిమా రిలీజ్ తరువాత పూర్తిగా క్లారిటీ రానుంది.