CM Jagan: కోవిడ్ కొత్త వేరియంట్ పై జగన్ రివ్యూ, ముందస్తు చర్యలపై దృష్టి!
- By Balu J Published Date - 04:16 PM, Fri - 22 December 23

CM Jagan: కోవిడ్ జేఎన్-1 కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైద్యం అందించేందుకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో చేరకుండానే రోగులు కోలుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్ లాంటి లక్షణాలు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే JN-1 వేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని వివరించారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో నమూనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. అవసరమైన మందులతో పాటు వ్యక్తిగత సంరక్షణ కిట్లు కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు.
ప్రభుత్వం నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంతోపాటు పీఎస్‌ఏ ప్లాంట్లను నడుపుతూ తక్షణ వినియోగం కోసం అందుబాటులోకి తెస్తున్నామని, ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌లు, డీ తరహా సిలిండర్‌లను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Also Read: Bangalore Airport: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గుర్తింపు