AP Violence: కాకినాడ – పిఠాపురంలో ఇంటెలిజెన్స్ హెచ్చరిక
అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎన్నికలు భిన్నంగా మారాయి.
- By Kavya Krishna Published Date - 04:21 PM, Mon - 20 May 24

అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎన్నికలు భిన్నంగా మారాయి. అధికారంలో ఉన్న నేతలే ఓటమి భయంతో ప్రత్యర్థులపై దాడికి దిగారు. ఓటమి అంచున ఉన్నా మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ.. కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లకు కూడా దిగి కొన్ని చోట్ల విధ్వంసం సృష్టించారు. అయితే.. ఏపీలో పోలింగ్ ముందు నుంచి జరిగిన అన్ని అసాంఘీక కార్యకలాపాల గురించి నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ యంత్రంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్నా కొన్ని చోట్ల ఇంకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల్లో చిచ్చు పెడుతూ అల్లర్లకు తెరలేపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో , ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాల్సి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా కౌంటింగ్ సమయంలో, ఫలితాల వెల్లడి తర్వాత కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. కాకినాడ నగరం, పిఠాపురం ప్రాంతాల్లో హింసాత్మక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ముందు, తర్వాత తగాదాలు తలెత్తే అవకాశం ఉందని నిఘా విభాగం ఈసీకి నివేదిక సమర్పించింది. ముఖ్యంగా ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట తదితర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గత ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికలకు సంబంధించిన తగాదాలకు సంబంధించి గతంలో కేసులున్న వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే కాకినాడలో గతవారం పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పిఠాపురం, కాకినాడలో పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆయా ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also : Vehicle Registration: షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!