Hijras : హిజ్రాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా..?
కేవలం అన్నదానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల కోసం విద్యారంగంలోనూ వీరు ముందడుగు వేశారు. సుమారు 40 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించడం, అనాథ యువతులకు పెళ్లిళ్లు చేయడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు
- Author : Sudheer
Date : 10-02-2026 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
Hijras : సాధారణంగా హిజ్రాలు అనగానే రైళ్లు, బస్టాండ్‌లు లేదా దుకాణాల్లో డబ్బులు అడిగేవారిగానే సమాజం చూస్తుంది. కానీ విజయనగరంలోని హిజ్రాలు మాత్రం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. శ్రీ విజయసాగర దుర్గ అమ్మవారి ఆలయం వేదికగా వీరు చేస్తున్న అద్భుత సేవా కార్యక్రమాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సమాజం నుంచి ఎదురైన అవమానాలను, చీత్కారాలను పక్కన పెట్టి, “సమాజానికి మేమేం చేయగలం?” అన్న గొప్ప సంకల్పంతో సుమారు 25 ఏళ్ల క్రితం ‘హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోసియేషన్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ ద్వారా వీరు చేస్తున్న సేవలు చూస్తుంటే వారు హిజ్రాలు కాదు, సమాజపు వజ్రాలని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఆకలి తీరుస్తూ.. అండగా నిలుస్తూ..
ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘నిత్య అన్నదాన పథకం’ ఎందరో నిరుపేదల ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజూ రాత్రి వేళ సుమారు 150 నుంచి 200 మంది అభాగ్యులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డిస్తున్నారు. కేవలం సాధారణ సమయాల్లోనే కాకుండా, కరోనా లాక్‌డౌన్ వంటి విపత్కర కాలంలో కూడా తమ ప్రాణాలకు తెగించి ఆసుపత్రుల్లోని రోగులకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆహారం అందించడం వీరి పెద్ద మనసుకు సాక్ష్యం. అలాగే భవాని మాల ధారణ సమయంలో వందలాది మంది భక్తులకు భోజన వసతి కల్పిస్తూ ఆధ్యాత్మిక సేవలోనూ ముందుంటున్నారు.
విద్య, ఉపాధి మరియు సామాజిక బాధ్యత
కేవలం అన్నదానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల కోసం విద్యారంగంలోనూ వీరు ముందడుగు వేశారు. సుమారు 40 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించడం, అనాథ యువతులకు పెళ్లిళ్లు చేయడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా, నార సంచుల తయారీ వంటి ఉపాధి మార్గాల ద్వారా తోటి హిజ్రాలకు, దివ్యాంగులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. విస్మయకరమైన విషయం ఏంటంటే, ఈ సేవల కోసం వీరు ఎవరినీ చందాలు అడగకుండా, తమకు భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్నే సామాజిక సేవకు మళ్లిస్తున్నారు. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో వీరు చూపిస్తున్న ఈ మానవత్వం అందరికీ ఆదర్శప్రాయం.