AP Thunderstorm: ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, పిడుగుల ముప్పు – రెడ్ అలెర్ట్ జారీ
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
- By Dinesh Akula Published Date - 10:29 PM, Tue - 23 September 25

విజయవాడ: (AP Thunderstorm)- ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. గురువారం నాటికి తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం సెప్టెంబరు 27న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం, శనివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు, గాలివానలు కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు గురువారం నుంచి ఆదివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. చెట్ల కింద నిలబడకూడదని ప్రజలకు సూచించారు.
విపత్తు నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావం ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది.
ఇక మరోవైపు వరదలు కూడా పెరుగుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 3,98,815 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4,45,102 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,167 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు యొక్క 10 స్పిల్‌వే గేట్లను 14 అడుగుల ఎత్తు వరకు ఎత్తి 3,49,620 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.90 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203.89 టీఎంసీలు నిల్వగా ఉంది.