GV Reddy : టీడీపీ కి షాక్ ఇచ్చిన జీవీరెడ్డి
GV Reddy : భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేయడం గమనార్హం
- By Sudheer Published Date - 09:04 PM, Mon - 24 February 25

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్న ఆయన, వ్యక్తిగత కారణాలతో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేయడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ అవినీతిపై ఆయన ఎన్నో సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించిన జీవీ రెడ్డి, ఫైబర్ నెట్ లో ఉద్యోగులను తొలగించడం, సంస్థలో జరుగుతున్న అనేక అన్యాయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల కారణంగా సంస్థ ఎండీ దినేష్ కుమార్ తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
Aegis Graham Bell Awards : ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ గుర్తింపు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవీ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ (AP Fiber Net Chairman) గా పదవి లభించిందని, కానీ అనూహ్యంగా ఆయన తన పదవిని వదులుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సోమవారం ఆయన తన రాజీనామా ప్రకటిస్తూ, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదాను కూడా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. టీడీపీ అధినాయకత్వం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ మరింత బలంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
YCP : రాజీనామా చేసే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు..? రోజా కామెంట్స్ కు అర్ధం ఇదేనా..?
మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామా టీడీపీకి భారీ షాక్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీవీ రెడ్డిని బుజ్జగించి మళ్లీ పార్టీలో కొనసాగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. టీడీపీ కోసం ఆయన చేసిన కృషి, మీడియా డిబేట్లలో పార్టీ తరఫున నిలబడడం, ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేయడం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటే, ఆయన రాజకీయ విరమణ అనూహ్యమైనదిగా అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఆయనకు ముఖ్యమైన పదవి ఇచ్చినప్పటికీ, రాజకీయ ఒత్తిడులు, విభేదాల నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.