PK and Farmers: అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి!
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు... ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది.
- Author : Hashtag U
Date : 11-05-2022 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు… ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది.
ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలి. ముఖ్యంగా 17శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలకు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారు. పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి.
తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలి. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.