Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ పై సవాళ్లు
అమరావతి అలైన్మెంట్ కేసులు ఏ1గా చంద్రబాబును చేర్చిన జగన్ సర్కార్ కు అరెస్ట్ చేసే దమ్ముందా? అంటూ టీడీపీ సవాల్ చేసింది.
- Author : CS Rao
Date : 12-05-2022 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి అలైన్మెంట్ కేసులు ఏ1గా చంద్రబాబును చేర్చిన జగన్ సర్కార్ కు అరెస్ట్ చేసే దమ్ముందా? అంటూ టీడీపీ సవాల్ చేసింది. ఆయన అరెస్ట్ పై వైసీపీ, టీడీపీ లీడర్లు పరస్పరం ఛాలెంజ్ విసురుకుంటున్నారు. గతంలోనూ బాబుపై కేసులు నమోదు చేసిన ఏపీ సర్కార్ అరెస్ట్ విషయంలో వెనక్కు తగ్గింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లోకేష్, చంద్రబాబుపై ఏపీ పోలీసులు పలు సందర్భాల్లో పెట్టినప్పటికీ అరెస్ట్ దాకా వెళ్లే ధైర్యం చేయలేదు. కానీ, ఈసారి చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే, టీడీపీ సీనియర్లు మీడియా ముందుకొచ్చి దమ్ముంటే అరెస్ట్ చేయండని సవాల్ చేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ తాజాగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబును, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పోలీసులు చేర్చారు. మరోవైపు అవసరమైతే చంద్రబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ మంత్రి బొత్సా, అంబటి రాంబాబు ఇతర వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు, నారాయణలపై కేసులు నమోదు చేశారని అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.