AP Pensioners: ఏపీలో పెన్షన్ దారులకు ఒక గుడ్ న్యూస్? ఒక బ్యాడ్ న్యూస్?
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల పై ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్ ప్రకటించింది.
- By Kode Mohan Sai Published Date - 12:00 PM, Fri - 22 November 24

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మార్గదర్శకాలతో పెన్షన్ పంపిణీని మరింత సమర్ధవంతంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
గుడ్ న్యూస్: ఇక నుంచి, పెన్షన్ అందుకుంటున్న వారు వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా, 3వ నెలలో రెండు నెలల పెన్షన్‌ను కలిపి మొత్తం మూడు నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
బ్యాడ్ న్యూస్: అయితే, వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్లను రద్దు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అలాంటి వారు మళ్లీ పెన్షన్ పొందాలంటే, ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇప్పటివరకు ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకపోతే, ఆ నెల పెన్షన్‌ను తిరిగి ఇవ్వరాదు అని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్‌లైన్ సిస్టమ్స్ పని చేస్తున్నాయి. కానీ, తాజాగా చంద్రబాబు సర్కార్ ఈ నిబంధనలను సవరించింది. ఇకపై, రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా, ఆ మొత్తాన్ని మూడో నెలలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మార్పు ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకుంది ప్రభత్వం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయని ఆయన ప్రకటించారు.
ఒకవేళ పెన్షన్‌దారులు వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే, వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి, ఆ తర్వాత వారు పెన్షన్ పొందడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పెన్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే, పునఃప్రారంభం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఇక, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే, చనిపోయిన వ్యక్తి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తోంది. అలాగే, ప్రతి నెల 3వ తేదీ లోపే పెన్షన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుంది.