SVSN Varma: ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్
ఎమ్మెల్సీ పదవి పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, "చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని" చెప్పారు.
- By Kode Mohan Sai Published Date - 12:44 PM, Mon - 10 March 25

SVSN Varma: ఎమ్మెల్సీ పదవి పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, “చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని” చెప్పారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. “కొన్ని సమీకరణాల వలన ఈసారి పదవి ఇవ్వలేకపోయినప్పటికీ, పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను. ఈ అవకాశమే నాకు పెద్ద పదవిగా భావిస్తున్నాను” అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని, ఎన్నికల సమయంలో కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో పాటు తన భార్య మరియు పిల్లలు కూడా కష్టపడి పనిచేశామని వర్మ వ్యాఖ్యానించారు.
ఎదురు చూపులు ఫలించలేదు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి నేతలకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదురు చూపులు ఫలించలేదు. పదవి తప్పకుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మడి జిల్లాలో ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీ స్థానాలు లభిస్తాయని అంతా ఊహించినప్పటికీ లెక్క తప్పింది. అధిష్టానం ఒక్కటీ కేటాయించలేదు.
పలువురికి నిరాశే మిగిలింది..
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాట్ల మధ్య కొందరికి టికెట్లు దక్కలేదు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలకు ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇచ్చే హామీ ఇచ్చినట్టు పార్టీ అధిష్టానం పేర్కొంది. దీంతో చాలా మంది ఎదురు చూసారు. అయితే రాష్ట్రంలో కేవలం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఖాళీ అవ్వడం వలన తెలుగుదేశం 3, జనసేన 1, బీజేపీకి 1 కేటాయించారు. ఈ పరిణామంతో ఆశావహులకు అవకాశం రాలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావులకు పదవి ఇచ్చే హామీ పార్టీ అధిష్టానం ఇచ్చింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెఎస్ జవహర్‌కు కూడా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కోనసీమ నుండి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పదవి ఆశించారు. రాష్ట్రంలో ఆశించే వారి సంఖ్య ఎక్కువ కావడంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. అందువల్ల, చాలామంది ఎమ్మెల్సీ ఆశలు నీరుగారిపోయాయి.
ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడి, ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఖాళీ అయితే హామీ ఇచ్చిన వారికి ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు, పల్లా శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నేతలకు ఫోన్ చేసి, 2027లో ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని, ఆ సమయంలో వారికి కచ్చితంగా స్థానం కల్పిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పరని తెలిపారు.
యనమలకు కీలక పదవి
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవి కాలం ఈనెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించినా దక్కలేదని సమాచారం. అయితే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీడీపీ కీలక నేత అయిన యనమలకు త్వరలోనే మరో కీలక పదవి రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వం లేదా గవర్నర్ పదవి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. తుని నియోజకవర్గ పరిధిలోని తేటగుంటలో హైవే సమీపంలో ఆయన ఇంటివద్ద పెద్ద గేటు నిర్మిస్తున్నారని, ఆ గేటు సమీపంలో బంకర్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామంతో యనమలకు కీలక పదవి రాబోతుందని ప్రచారం పెరిగింది.