Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్ ..
- Author : Sudheer
Date : 13-05-2024 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ వ్యాప్తంగా నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరు గంటలకు సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద లైనులో నిలబడ్డవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.. 96 నియోజకవర్గాల్లో 42 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్ లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బంగాల్లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. 2019 నుంచి జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఏపీ విషయానికి వస్తే..
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు.. అటు తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. ఏపీలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఇంకా బారులు తీరడంతో, వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గడువు ముగిసినప్పటికీ.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినా.. లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం విశేషం. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుష ఓటర్లు (64.28%) ఉండగా.. 1.40 కోట్లకు పైగా మహిళలు (66.84%) పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పురుషులతో పోలిస్తే.. మహిళలే చురుగ్గా ఈ పోలింగ్‌లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి 85% శాతం పోలింగ్ నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.
Read Also : Kannappa Teaser : కన్నప్ప టీజర్ రిలీజ్ అప్డేట్.. ప్రభాస్ ‘కల్కి’ స్టైల్‌లో..