AP : జగన్ కు ఓటు వేసి తప్పు చేశా – మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని.. జగన్ గతంలో ఓటేసినందుకు తన చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తిందంటూ ఘాటు విమర్శలు చేశారు
- By Sudheer Published Date - 04:37 PM, Sat - 16 September 23

జగన్ కు ఓటు వేసి తప్పు చేశానన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy ). స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు ను అరెస్ట్ చేయడాన్ని రవీంద్రారెడ్డి..తీవ్రంగా ఖండించారు. అసలు స్కామే లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రిమాండ్ విధించడం దారుణమన్నారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్లు లేదని అయినప్పటికీ ఆయన్ను అదుపులోకి తీసుకొని , 14 రోజుల రిమాండ్ విధించడం యావత్ ప్రజానీకం తప్పుపడుతుందన్నారు. అంతే కాదు న్యాయవ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తి ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 73 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఎక్కడికి పారిపోతారని ప్రశ్నించారు. ఎప్పుడు పిలిచినా కోర్టుకు హాజరై సహకరించే వ్యక్తిని పట్టుకొని ఈరోజు అత్యంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాలలో అరెస్టు చేసి అక్కడ స్థానిక కోర్టులో హాజరుపెట్టకుండా విజయవాడకి ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని.. జగన్ గతంలో ఓటేసినందుకు తన చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తిందంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని న్యాయవ్యవస్థ పున:పరిశీలించాలని కోరారు.
Read Also : Pawan Kalyan: పవన్ తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
డీఎల్ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. రాజకీయ పరిణామాల క్రమంలో జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత కొద్ది నెలల క్రితం ఆ పార్టీని వీడారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కొద్ది నెలలుగా గళం విప్పుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని, జనసేన-టీడీపీ పొత్తులో పోటీ చేస్తే తిరుగులేదని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమంటూ డీఎల్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కడప జిల్లాకు చెందిన డీఎల్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేయగా.. వైఎస్‌కు నమ్మినబంటుగా డీఎల్ గుర్తింపు పొందారు. డీఎల్ వైసీపీని వీడటంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.