Diviseema Cyclone : దివిసీమ విషాదానికి 47 ఏళ్లు
Diviseema Cyclone : 1977 నవంబర్ 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు.
- By Sudheer Published Date - 11:25 AM, Tue - 19 November 24

దివిసీమ ఉప్పెన (Diviseema Uppena) జరిగి నేటికీ సరిగ్గా 47 ఏళ్లు. 1977 నవంబర్ 19న (Diviseema Incident Date) కృష్ణా జిల్లా సమీపంలో వచ్చిన జల ప్రళయం వేల మందిని పొట్టనపెట్టుకుంది. కడలి ఉప్పొంగి లంక గ్రామాల్లో కడుపుకోత మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టింది. 1977 నవంబర్ 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు. 10 వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఈ ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలాంటి విధ్వసం వస్తుందో తెలియంది కాదు. భారీ వర్షాలు, వరదలు, ఉప్పెనలు, సునామీలు, భూకంపాలు వంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మానవ జీవితాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్ని ఏళ్లు అయినా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచిపోతాయి. అలాంటిదే దివిసీమ ఉప్పెన. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు.. ఎవరికైనా కనురెప్పల మాటున దాగిన కన్నీళ్ల ఉప్పెన కట్టలు తెంచుకుంటుంది. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న ఆ మహా విషాదం జరిగి నేటికి 47 ఏళ్లు. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు.. దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం కూడా. సముద్రం జల ఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకు పడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారత దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు.
ఈ విషాదం నేర్పిన పాఠంతో దివిసీమలో అల్లకల్లోల పరిస్థితులు ఎదురైనప్పుడు బయటపడేందుకు తుపాన్ షెల్టర్లు, కరకట్టలు నిర్మించారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రక్షణ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడంతో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వాటిలో కొన్ని పూర్తిగా పాడైపోగా కొన్నింటిని అధికారులు కూల్చివేశారు. మూడు మండలాల పరిధిలో కృష్ణా నదికి వచ్చే వరదల నుంచి రక్షణగా నిర్మించిన కరకట్ట గుల్లలమోద నుంచి ఉల్లిపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు కరకట్టను నిర్లక్ష్యం చేయడంతో తమ జీవనం ప్రశ్నార్థకంగా మారిందని తీరప్రాంత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకంలో భాగంగా కరకట్టకు మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోకపోయేసరికి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 11 లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తే ప్రస్తుత కరకట్టలు తట్టుకోలేవని పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని..దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
Read Also : Singareni : సింగరేణి మరో కొత్త వ్యాపారం.. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ