Tirumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమలలోభక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి
- Author : Prasad
Date : 23-09-2023 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమలలోభక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‌మెంట్లలో ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనం పూర్తి కావడానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. గరుడోత్సవం రోజున శ్రీవారిని 72,650 భక్తులు దర్శించుకోగా.. గరుడోత్సవంలో శ్రీవారి హుండీలో 3.33 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.. అదనంగా 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ తెలిపింది.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సేవ అర్ధరాత్రి వరకు కొనసాగింది. గరుడవాహనం ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తబృందాలు, భజనలు, డప్పువాయిద్యాలు, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశ్వ చక్రవర్తి అయిన మలయప్ప స్వామిని శోభాయమానంగా తిలకించి ఆలయ వీధుల్లో గరుత్మంతుడిని ఊరేగించారు. ప్రత్యేక గరుడ వాహన సేవ సందర్భంగా.. శ్రీవారి మూలవిరాట్ (ప్రధాన దేవత) అలంకరించేందుకు అనేక పురాతన మరియు ప్రత్యేక ఆభరణాలు ఉపయోగించారు.. వీటిలో మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల ఉన్నాయి. అంతకుముందు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి దివ్య అవతారమైన మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.