APCRDA Building Design: ఏపీ సీఆర్డీఏ భవనం డిజైన్‌పై ప్రజల ఓటింగ్ గడువు పొడగింపు
అమరావతిలో ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ భవనానికి సంబంధించిన డిజైన్లపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఓటింగ్ ద్వారా ప్రజలు 4వ డిజైన్‌ను అత్యధికంగా పరిగణించారు.
- By Kode Mohan Sai Published Date - 12:36 PM, Mon - 9 December 24

ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రాజెక్టు బిల్డింగ్ డిజైన్ ఎంపిక కోసం ఇటీవల ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ గడువు ముగిసింది, అత్యధికమంది 4వ డిజైన్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఓటింగ్ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గడువును పొడిగిస్తూ, ప్రజారాజధాని నిర్మాణంలో మరింత మందిని భాగ్యస్వామ్యం చేయడానికి, గడువును ఈనెల 14వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకు ఓటింగ్‌లో పాల్గొనని వారు, ఏపీ సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్ (https://crda.ap.gov.in/APCRDAV2/Views/AdminBuildingPoll.aspx) కు వెళ్లి తమకు నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు.
📍ఫ్లాష్.. ఫ్లాష్..📍
ఏపి సిఆర్‌డిఏ ప్రాజెక్టు బిల్డింగు డిజైన్ ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహిస్తున్న అధికారులు గడువు పొడిగించారు. మరింతమందిని ప్రజారాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం కోసం ఈనెల 14వ తేదీ వరకు గడువు పెంచారు.ఇంకా ఓటింగు చేయనివారు ఏపీ సిఆర్‌డిఏ అధికారిక వెబ్‌సైట్… pic.twitter.com/jLFfbMyHOF
— AMARAVATI (@PrajaRajadhani) December 9, 2024
అమరావతిలో నిర్మించబోయే ఏపీ సీఆర్డీఏ భవన డిజైన్ పై అభిప్రాయ సేకరణ
అమరావతిలో నిర్మించబోయే ఏపీ సీఆర్డీఏ భవనం ఎలా ఉండాలనే అంశంపై అధికారులు ఇటీవల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా, వారం రోజుల్లో 9,756 మంది తమ అభిప్రాయాన్ని నమోదు చేసుకున్నారు. వీరిలో 3,354 మంది 4వ డిజైన్‌కు మద్దతు తెలిపారు. ప్రజల సూచనలను అధికారులు సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పోలింగ్ పై కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటన
ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ భవనం ఎలా ఉండాలనే అంశంపై అధికారిక పోలింగ్‌ను నిర్వహించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కాటమనేని ఇటీవల ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసుకునే అంశాన్ని మరింత ప్రాధాన్యం ఇచ్చే ప్రక్రియను అమలు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.
ప్రజలకు నచ్చిన విధంగా ప్రాజెక్టు నిర్మాణం
సీఆర్డీఏ అధికారులు, ప్రజల అభిప్రాయాలను మరింత విలువనిచ్చి, ప్రతీ అంశం వారి ఆమోదంతోనే నిర్ణయించబడుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కార్యాలయ భవనం డిజైన్ విషయంలో కూడా ప్రజల సూచనలను సమకూర్చి, పది ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించి వాటిని వెబ్‌సైట్‌లో ఉంచారని వారు వెల్లడించారు.
ప్రజలు తమకు నచ్చిన డిజైన్‌పై ఓటు వేయాలని అధికారుల సూచన
ప్రజలు తమకు నచ్చిన డిజైన్‌పై క్లిక్ చేసి ఓటు చేయాలని అధికారులు కోరారు. మెజార్టీ ఓట్ల ఆధారంగా ముందుకు వెళ్ళాలని, మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించారు. ఈ ప్రక్రియపై ఓటింగ్ డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించారు. అయితే, తాజాగా ఈ గడువును 14వ తేదీ వరకు పొడిగించారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు.