Chintakayala Vijay : రాజ్యసభ రేసులో..చింతకాయల విజయ్..?
Chintakayala Vijay : చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించినా.. పొత్తు కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపుతామని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు
- By Sudheer Published Date - 12:28 PM, Thu - 28 November 24

ఏపీ(AP)లో మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల (Rajya Sabha Seats)కు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరణ , నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13 వరకు ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించబడుతుంది. ఇక అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలైంది. ఈ స్థానాలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, మరియు ఆర్. కృష్ణయ్య రాజీనామాల కారణంగా ఖాళీ అయ్యాయి. వీరు రాజీనామా చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి.
ఇక ఎన్నికల ప్రకటన రావడంతో కూటమి పార్టీల్లోని ఆశావహులు అప్రమత్తమయ్యారు. ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయిపోయారు. మరి ఈ 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులే బరిలోకి దిగుతారా లేక కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులకూ అవకాశం లభిస్తుందా.. చివరికి సీట్లు దక్కించుకొనే నాయకులెవరు అనే ప్రశ్నలు.. రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తెలుగుదేశం (TDP) కూటమికి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించడంతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. లెక్క ప్రకారం 2026 వరకు ఏపీలో రాజ్యసభకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో చాలా ముందుగానే పెద్దల సభకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి 2020లో ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పదవీకాలం 2026 వరకు ఉంటుంది. ముందుగానే రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో ఎన్నికైన వారు మిగిలిన రెండేళ్ల కాలం మాత్రం పదవిలో ఉంటారు. 2026లో ఈ సీటుకి మరోసారి ఎన్నికలు జరుగుతాయి.
ఇక ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులు 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి వీరి పదవీకాలంలో ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉంది. వీరి స్థానంలో ఎన్నికయ్యే సభ్యులు 2028 వరకు రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతారు. ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత శాసన సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 164 మంది సభ్యుల బలం ఉండగా.. వైసీపీకి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలు కూటమి తెలిగ్గా గెలుచుకొంటోంది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగిన వైపీపీ అసలు పోటీలో ఉండే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో కూటమి నుంచి రాజ్యసభ సీటు దక్కించుకొంటే ఎంపీ పదవి వచ్చినట్లే. అందుకే మూడు పార్టీల్లోని సీనియర్ నాయకులు పెద్దల సభలో పాగా వేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలానికి మించి 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన పార్టీలు త్యాగం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈ దఫా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి చోటు దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. పొత్తు ధర్మం కోసం త్యాగం చేసిన జనసేన పార్టీకి కనీసం ఒక్క రాజ్యసభ సీటు కేటాయించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ స్థానం జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లేదా ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరికి లభించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు రాజ్యసభకు వెళ్లడానికి ఆసక్తి చూపించని పక్షంలో.. కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీశ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన కీలక నేతల పేర్లు పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తెలుగుదేశం పార్టీలోనూ రాజ్యసభ ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాజ్యసభలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేతల నుంచి పెద్దల సభలో ప్రాతినిధ్యానికి విపరీతమైన పోటీ ఉంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన గల్ల జయదేవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాజ్యసభ పదవీకాలం ముగిసిన సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనను రాజ్యసభకు పంపిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
గతంలో హామీ ఇచ్చిన మేరకు రాజ్యసభ రేసులో యువనేత చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా.. చంద్రబాబు ఈసారి ఇచ్చిన మాట ప్రకారం పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇస్తూ ఉన్నారు. ఇటీవల నామినేట్ పదవుల జాబితాను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే చింతకాయల విజయ్‌కు రాజ్యసభ కన్‌ఫామ్ అని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కూటమి ఫార్ముల ప్రకారం ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. మరో రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులకు అవకాశం లభించనుంది. ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్ జాబితా నుంచి మరొకరిని జూనియర్ జాబితా నుంచి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. 2024 ఎన్నికల టికెట్ల కేటాయింపులో లోకేశ్ మార్క్ కనిపించింది. ఆ తర్వాత క్యాబినెట్ కూర్పులోనూ ఆయన టీమ్‌కే ప్రాధాన్యత లభించింది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్దుల ఎంపికలోనూ లోకేశ్ సెలెక్షన్ కీలకం కానుందని తమ్ముళ్లలో వినిపిస్తోంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే లోకేశ్ ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ చింతకాయల విజయ్‌కే ఈసారి రాజ్యసభ దక్కనుందని పార్టీ వర్గాల అంచనా.
మరోవైపు చింతకాయల విజయ్ (Chintakayala Vijay) అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించినా.. పొత్తు కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపుతామని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉంది. జగన్ హయాంలో.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా.. ఏమాత్రం వెనుకబడుగు వేయకుండా తెలుగుదేశం విజయం కోసం చింతకాయల కుటుంబం శ్రమించింది. కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వకపోయినా.. అధినేత చంద్రబాబు ఆదేశాలను తుచ తప్పకుండా పాటించి స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు అయ్యన్నపాత్రుడు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికల్లో త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తే.. చింతకాయల విజయ్‌కు రాజ్యసభ సీటు ఖాయంగా వస్తుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్ధులను ఫైనల్ చేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కళ్యాణ్ త్వరలోనే బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కూటమి పెద్దల భేటీ తర్వాత అభ్యర్ధులపై క్లారిటీ రావచ్చని తెలుస్తోంది.
Read Also : Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్ థాంక్స్‌గివింగ్ వేడుకలు