Andhra Pradesh : ఏపీలో రేపటి మొనగాళ్లు లేరా? వృద్ధుల రాష్ట్రంగా మారబోతోందా?
ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రం కాబోతోందా? పిల్లల సంఖ్య తగ్గుతోందా? అక్కడి యువత వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లి స్థిరపడుతోందా?
- By Hashtag U Published Date - 01:08 PM, Mon - 2 May 22

ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రం కాబోతోందా? పిల్లల సంఖ్య తగ్గుతోందా? అక్కడి యువత వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లి స్థిరపడుతోందా? అసలు ఏపీలో యువత శాతం ఎందుకు తగ్గుతోంది? ఒకటీ రెండు కాదు.. చాలా ప్రశ్నలు వస్తాయి. కేంద్ర జనాభా లెక్కల విభాగం రిలీజ్ చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే – ఎస్ఆర్ఎస్ ను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
14 సంవత్సరాలు.. అంతకంటే చిన్న వయసున్న పిల్లల శాతం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోనే తక్కువ. ఏపీలో 14 సంవత్సరాల లోపు పిల్లలు కేవలం 19.4 శాతమే ఉన్నారు. ఎస్ఆర్ఎస్ లెక్కలన్నీ 2017-2019 సంవత్సరాలకు సంబంధించినవి. ఏపీలో తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువతరమంతా వేరే రాష్ట్రాలకు, విదేశాలకు వలస పోతోంది. 2019 తరువాత కూడా ఇవి పెరిగే ఉంటాయి కాని తగ్గే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో పంటభూములకు కొదవలేదు. ఖనిజ సంపదకు లోటు లేదు. తీరప్రాంతం చాలా ఎక్కువ. అంటే ఉపాధిని కల్పించడానికి ఇంతకుమించిన సహజవనరులు ఏం కావాలి? కానీ పాలకుల్లో ముందు చూపు కొరవడడం, తగినన్ని పరిశ్రమలు రాకపోవడం, సహజ వనరుల వినియోగంతో ఉపాధిని కల్పించే చర్యలు తీసుకోకపోవడంతో యువత వేరే ప్రాంతాలకు పొట్టచేతబట్టుకుని వెళ్లిపోతోంది.ఏపీలో పట్టుమని వెయ్యి మందికి ఉపాధిని ఇచ్చే పరిశ్రమలే లేవు. విశాఖ పరిధిలో ఉన్న ఫార్మా కంపెనీలు, శ్రీసిటీలో ఉన్న కొన్ని పరిశ్రమల్లో యువతకు ఉపాధి దొరుకుతున్నా అవి చాలడం లేదు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ స్థాయి ఉన్న విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలను ఇవ్వడానికి పరిశ్రమలు తరలివస్తాయి. కానీ అలాంటి స్థాయికి రాష్ట్రంలో విద్యాసంస్థలు చేరుకోలేకపోతున్నాయి. పేరున్న సంస్థల ఐటీ పరిశ్రమలు కూడా లేవు. గత ప్రభుత్వ హయాంలో వచ్చినవీ మూతపడ్డాయి. దీంతో ఏపీలో యువత హైదరాబాద్, పుణె, బెంగళూరు, చెన్నైకు తరలిపోతోంది.
రాష్ట్రంలో పేరెన్నికగన్న నిర్మాణాలు ఉండుంటే భారీగా ఉపాధిని కల్పించడానికి ఛాన్స్ ఉండేది. రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే 15 వేల నుంచి 20 వేల మందికి ఉపాధిని అందించింది. ఇప్పుడు అది కొనసాగి ఉంటే.. అంతకుమించిన సంఖ్యలో ప్రజలకు ఉపాధి దొరికేది. దీంతోపాటు అమరావతి నగర నిర్మాణం వల్ల విద్యాసంస్థలు, హోటళ్లు, ఐటీ పరిశ్రమలు వచ్చేవి. పర్యాటక ప్రదేశాలు డెవలప్ అయ్యుండేవి. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఇంకా పెరిగేవి. పల్లెటూళ్లను ఉత్పిత్తి కేంద్రాలుగా మార్చాలి. పరిశ్రమలను ఆహ్వానించాలి. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.