Chandrababu : ఎంపీలకు చంద్రబాబు టార్గెట్..!
Chandrababu : 2025-26 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను బడ్జెట్‌లో ప్రతిబింబింపజేయాలని చంద్రబాబు ఎంపీలకు స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 12:44 PM, Wed - 29 January 25

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) టీడీపీ ఎంపీలకు(TDP MP) కీలక సూచనలు చేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను బడ్జెట్‌లో ప్రతిబింబింపజేయాలని చంద్రబాబు ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఆయన, ఏపీకి అవసరమైన నిధులు, ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు వచ్చేలా వారు కృషి చేయాలని కోరారు.
Gachibowli Racket Busted : గచ్చిబౌలి ప్రాంతంలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం..
చివరి నిమిషంలోనూ కేంద్ర బడ్జెట్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నందున, ఎంపీలు తమ ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టంగా సూచించారు. రాష్ట్రంలోని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల వివరాలను ఎంపీలకు వివరించారు. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇదే అని ఆయన వ్యాఖ్యానించడంతో, ఎంపీలపై మరింత ఒత్తిడి పెరిగినట్టైంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధుల ప్రాముఖ్యత ఏమిటో వివరించిన చంద్రబాబు, ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కృషి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, రహదారి ప్రాజెక్టులు వంటి కీలక అంశాలకు నిధులు సాధించాలనే లక్ష్యాన్ని ఎంపీలు పెట్టుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించడం చంద్రబాబు అభినందించారు. ఢిల్లీలో తెలుగుదనం ప్రతిబింబించేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఎంపీలు తమ నియోజకవర్గాలకు నిధులు తేవడంతో పాటు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని ఆయన అన్నారు. మరి చంద్రబాబు టార్గెట్ తో టీడీపీ ఎంపీలు ఎంత మేరకు తమ బాధ్యతను నిర్వర్తిస్తారో చూడాలి.