TDP: టీడీపీ శ్రేణుల్లో ఊపొచ్చినట్టేనా..?
- By HashtagU Desk Published Date - 01:54 PM, Wed - 30 March 22

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నా, ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ పై వార్ ప్రకటించింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు పార్టీ 40వ వార్షిక వేడుకను సరైన తేదీగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవ్వాలని సమరశంఖం పూరించారు.
ఈ నేపధ్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పసుపు పార్టీ జెండా రెపరెపలాడించారు. అంతే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని ఊర్లలో అన్నదానాలు, ర్యాలీలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీ తమ్ముళ్ళు. ఇంకా చెప్పాలంటే గత మూడేళ్లుగా సైలెంట్‌గా ఉన్న పసుపు నేతలంతా, టీడీపీ ఆవిర్భవ దినోత్సవం రోజున ఒక్కసారిగా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశారు.
ఇక గత టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు చంద్రబాబు. మరోవైపు తెలుగుదేశంపార్టీలో ఇప్పటికే సీనియర్లు ఎక్కువయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న క్రమంలో, వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లను యువతకే కేటాయిస్తామని, చంద్రబాబు ప్రకటించారు. అయితే రాజకీయాల్లో వారసత్వం కంటే, ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే పెద్ద పీట వేస్తామని చంద్రబాబు ఫుల్లుగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
తాను చంద్రబాబు అంత మంచివాడిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. ఎన్టీఆర్ దేవుడు అయితే, తన తండ్రి చంద్రబాబు రాముడు అని చెప్పిన లోకేష్, తాను మాత్రం మూర్ఖుడుని అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా జగన్ పాలనలో తనపైన తన కుటుంబంపైన, ముఖ్యంగా పార్టీ నేతలపై జరిగిన ప్రతి దాడికి, ఊహించని రేంజ్‌లో బదులు చెబుతానంటూ వైసీపీ నేతలకు లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీకి అండగా ఉన్నవారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.
మొత్తం మీద చాలా రోజులకు టీడీపీ యాక్టీవ్ మూడ్‌లో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమితో రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీ 40 సంవత్సరాల పండుగ రోజు, పార్టీ శ్రేణుల్లో కాస్త ఊపు వచ్చినట్టే కనిపిస్తుంది. దీంతో 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించడం చూస్తుంటే, రెండేళ్లు ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందని, టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న అధికార వైసీపీ పార్టీకి టీడీపీ ఎంతవరకు పోటీ ఇస్తుందో లేదో చూడాలి.