CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు
CBN : లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అమరావతికి చేరుకున్నారు.
- By Sudheer Published Date - 12:19 PM, Thu - 6 November 25
లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అమరావతికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరి ఘనస్వాగతం పలికారు. పసుపు పతాకాలతో, పూలదండలతో, “జై చంద్రబాబు” నినాదాలతో మొత్తం పరిసరాలు మార్మోగాయి. లండన్ పర్యటనలో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం, సాంకేతిక రంగంలో భాగస్వామ్యాలపై చర్చించడం వంటి కీలక అంశాలపై సీఎం పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా లండన్ పర్యటనలో ఆయన చేసిన చర్చలు ముఖ్యమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
అమరావతికి చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు అధికారులతో సమావేశమై రాష్ట్ర పరిపాలన విషయాలపై సమీక్ష నిర్వహించారు. లండన్ పర్యటనలో సాధించిన ఫలితాలపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ఆయన రాకతో పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏసీఏ (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గన్నవరం నుంచి అమరావతి వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్వాగత వాతావరణం సృష్టించారు. టిడిపి జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, బైక్ ర్యాలీలతో ప్రధాన మార్గాలు పసుపు రంగులో తళుక్కుమన్నాయి.
రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో మహిళా క్రికెటర్ శ్రీచరణి ఆయనను కలవనున్నారు. కడప జిల్లా యరమలపల్లె గ్రామానికి చెందిన శ్రీచరణి ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం చంద్రబాబు అభినందించనున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో శ్రీచరణి గన్నవరం నుంచి అమరావతివరకు తీసుకువస్తూ ప్రత్యేక స్వాగత ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర యువతకు ప్రేరణగా నిలుస్తున్న శ్రీచరణిని ప్రభుత్వం గౌరవించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.