ఏపీలో మా పొత్తు ఆ పార్టీతోనే.. తేల్చేసిన బీజేపీ నేతలు
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు.
- Author : Balu J
Date : 28-10-2021 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న ఘటనలపై స్పందించిన బీజేపీ బద్వేల్ ఉపఎన్నికల్లో లబ్ది పొందడానికే రెండు పార్టీలు అలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆ పద్దతిని కండిస్తున్నామని బీజేపీ జాతీయ నాయకులు అన్నారు. ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ నుండి విముక్తి కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ తెలిపారు. ప్రజల కలలు నెరవేరేలా రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందని తొందర్లోనే ఏపీ ప్రజలకు విముక్తి లభిస్తుందని అయన అన్నారు.
టీడీపీతో గతంలో కలిసి పనిచేసినా, ఇకపై ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దీదోర్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏపీలో జనసేనతో కలిసి పోటీచేస్తుందని, అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అధికార పార్టీ బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తోందని, ప్రభుత్వ అధికారులను తమ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని సునీల్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడడమే కాకుండా, క్రిస్టియానిటీని, మతమార్పిడిలను ప్రోత్సహిస్తోందని ఈ ప్రభుత్వం ఎక్కువరోజులు మనుగడ సాధించదని ఆయన స్పష్టం చేశారు.