Amaravati Relaunch : అమరావతి ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు !
Amaravati : ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి.
- By Sudheer Published Date - 12:39 PM, Fri - 2 May 25

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం పునఃప్రారంభం కావడం రాష్ట్రానికి ఒక సరికొత్త శకానికి నాంది పలికినట్లైంది. ఈ వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు దేశవిదేశాల్లోని పెట్టుబడిదారులకు, ఐటీ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలవారికి ఆశాజనక సంకేతాల్లా మారబోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. ఈ నిర్మాణం కొనసాగుతున్న కొద్దీ, కొత్త పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇది కేవలం రాజధాని అభివృద్ధే కాకుండా, రాష్ట్ర ఆర్థికవృద్ధికి గట్టి పునాది వేయనుంది.
ఉపాధికి నూతన ఆవకాశాలు – వలసలకు బ్రేకులు
అమరావతి నిర్మాణ పనుల ద్వారానే రాబోయే 3-4 ఏళ్లలోనే కనీసం 30 వేలమంది నుండి 40 వేలమందికి ఉపాధి లభించనుంది. ఈ పనుల్లో ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, మజ్దూరు కార్మికులు మొదలుకొని అన్ని రంగాల వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీంతో వలస వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోని యువతకి స్వదేశంలోనే ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతోంది. అంతేకాక, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులకు కూడా ఇది ఉపాధి కేంద్రంగా మారనుంది. ఈ అభివృద్ధి ప్రణాళిక అమలు కావడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు బలపడతాయి.
వాణిజ్య, వ్యవసాయ రంగాలకు నూతన ఊపిరి
అమరావతిలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తే, వారికి అవసరమయ్యే నిత్యవసరాలు, గృహోపకరణాలు, వైద్యం, రవాణా, వినోద రంగాలు కూడా విస్తరించనున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలోని రైతులకు, వ్యాపారులకు, పాడిరైతులకు భారీగా మార్కెట్ ఏర్పడుతుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేలా మారుతుంది. దీని ప్రభావం పోలవరం, మెట్రో, రైల్, రోడ్, పోర్ట్స్ వంటి ఇతర మెగా ప్రాజెక్టుల అభివృద్ధిపై కూడా పడుతుంది. ఈ మొత్తంమీద, అమరావతి నిర్మాణం కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి, భవిష్యత్తు అనే నాలుగు మూలస్తంభాలపై నూతన భారత్‌ను నిర్మించే మార్గంగా మారుతోంది.